
- 160 ఏండ్ల నాటి బ్రిటీషర్ల పేర్లను మార్చేందుకు నిర్ణయం
- దీనిపై కంటోన్మెంట్ ఆఫీసర్లుకు వచ్చిన ఆదేశాలు
- తెలంగాణ ఫ్రీడం ఫైటర్ల పేర్లు కూడా పెట్టాలంటున్న స్థానికులు
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్పరిధిలో బ్రిటీషర్ల పేర్లతో ఉన్న రోడ్లకు మనదేశ సైనికుల పేర్లు రానున్నాయి. బోర్డులోని రోడ్లకు నేటికీ 160 ఏండ్ల కిందటి బ్రిటీష్ రక్షణ అధికారుల పేర్లే ఉన్నాయి. వాటిని మార్చి, మన స్వాతంత్య సమర యోధుల పేర్లు పెట్టాలని బోర్డు అధికారులకు డిఫెన్స్ డైరెక్టరేట్‌జనరల్ డిఫెన్స్ఎస్టేట్ (డీజీడీఈ)నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కంటోన్మెంట్‌లోని సుమారు 15 నుంచి 20 రోడ్లకు కొత్త పేర్లు రానున్నాయి. ఈ నెల17న జరిగే బోర్డ్ మీటింగ్‌లో పేర్లను డిసైడ్ చేసి డీజీడీఈ ఆఫీస్‌కు పంపనున్నారు. దేశంలోని అన్ని కంటోన్మెంట్ల పరిధిలోని రోడ్ల పేర్లు మార్చాలని ఆదేశాలు వచ్చాయని బోర్డు అధికారులు తెలిపారు.
ఐదేండ్ల తర్వాత మళ్లీ..
కంటోన్మెంట్‌లోని బైసన్ గన్నర్ యూనిట్దగ్గర ఉన్న బ్రిగేడియర్సయ్యద్ రోడ్డు, తాడ్‌బండ్ డైమండ్ పాయింట్‌ను కలుపుతూ బ్రిటీష్ కమాండర్ జాన్ నికల్సన్ రోడ్ ఉంది. ఈ రోడ్‌కు 2017లో మన దేశ సైనిక అధికారి కేతన్పాల్ పేరు పెట్టారు. మళ్లీ ఐదేండ్ల తర్వాత రోడ్ల పేర్లు మారనుండగా ఎలాంటి పేర్లు పెడతారని స్థానికుల్లో చర్చ నడుస్తోంది. సైనిక అధికారులు, వీర జవాన్ల పేర్లు పెట్టాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా శౌర్య పతక విజేతలు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల పేర్లను అధికారులు బోర్డు మీటింగులో చర్చించనున్నారు.
తెలంగాణకు చెందిన వారివి కూడా..
తెలంగాణ పోరాట యోధుల పేర్లకు, నిజాం కాలం నాటి సైనికుల, అమరుల పేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు స్థానికులు కోరుతున్నారు. దీని ద్వారా రాబోయే తరాలకు తెలంగాణ గొప్పతనం తెలిసే వీలుంటుందని అంటున్నారు. దీంతోపాటు పేర్లు మార్చే కార్యక్రమమే కాకుండా... కంటోన్మెంట్ ఏరియాలో డెవలప్మెంట్కూడా అవసరమని జనాలు కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తాగునీటి సమస్య ఉందని, రోడ్లు, డ్రైనేజీలు సరిగా లేవని పేర్కొంటున్నారు. అధికారులు వీటిపైన కూడా స్పందించాలని కోరుతున్నారు.