ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నానా పటోలే ఎన్నికయ్యారు. బీజేపీ క్యాండిడేట్ కిసాన్ కథోరే నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడంతో పటోలె ఎన్నిక ఏకగ్రీవమైంది. పటోలే ఎన్నికను సభలో ప్రొటెం స్పీకర్ దిలిప్ వాల్సే ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికైన నానా పటోలేకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సీఎం ఉద్ధవ్, ఇతర సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన్ను స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్లారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన పటోలే స్పీకర్‌గా ఎన్నికవడం సంతోషకరమని ఉద్ధవ్ అన్నారు. ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని నమ్మకముందన్నారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే తాము వెనక్కి తగ్గినట్లు ఫడ్నవీస్ తెలిపారు. పటోలేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి దక్కుతుందని భావించామని, పదవి ఏదైనా రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అత్యున్నత పదవైన స్పీకర్ స్థానానికి విదర్భ ప్రాంతం నుంచి ఎన్నికవడం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి.
రాత్రికిరాత్రయితే ఏదీ చేయం: ఉద్ధవ్
ఫడ్నవీస్‌ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటించిన తర్వాత ఉద్ధవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నేను అసెంబ్లీకి మళ్లీ వస్తా’నని ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ పదే పదే చెప్పారని, తాను మాత్రం వస్తానని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రాత్రికిరాత్రి ఏ పనీ చేయనని ప్రజలు, సభకు చెబుతున్నానని పరోక్షంగా ఇటీవల ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడాన్ని ప్రస్తావించారు. ప్రజలకు నచ్చినట్టుగా తన పాలన ఉంటుందన్నారు. రుణమాఫీతో పాటే రైతుల బాధలను కూడా దూరం చేస్తామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నవారు ఇప్పుడు తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, మిత్రులుగా ఉన్నవారు ప్రతిపక్ష కుర్చీలపై కూర్చుకున్నారని అన్నారు. ఏదేమైనా ఫడ్నవీస్ తనకు మంచి స్నేహితుడని, ఆయన్ను ప్రతిపక్ష నేతగా చూడనని చెప్పారు. హిందుత్వ భావజాలాన్ని ఎన్నటికీ వదలనని ఉద్ధవ్ చెప్పారు.

