Balakrishna: 'ఆదిత్య 999'కి క్రిష్ దర్శకత్వం, మోక్షజ్ఞ ఎంట్రీ.. నందమూరి అభిమానులకు పండగే!

Balakrishna: 'ఆదిత్య 999'కి క్రిష్ దర్శకత్వం, మోక్షజ్ఞ ఎంట్రీ.. నందమూరి అభిమానులకు పండగే!

నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది.  ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి కొనసాగింపుగా రాబోతున్న 'ఆదిత్య 999' ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మొదట ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ, అభిమానుల అంచనాలు, సినిమా పరిధిని దృష్టిలో ఉంచుకుని ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తన దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకుని, ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి అప్పగించినట్లు తెలుస్తోంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి బ్లాక్‌బస్టర్‌తో బాలయ్యను కొత్తగా చూపించిన క్రిష్, ఇప్పుడు 'ఆదిత్య 999'తో మరోసారి వారిద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో క్రిష్ తనదైన ప్రత్యేక శైలిలో, అద్భుతమైన విజువల్స్‌తో టైమ్ ట్రావెల్ కథాంశాన్ని ఎలా మలుస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో ప్రేక్షకులను, ముఖ్యంగా నందమూరి అభిమానులను ఉర్రూతలూగించే మరో అద్భుతమైన వార్త ఏమిటంటే.. నట వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం.  ఈ హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో తండ్రీకొడుకులు కలిసి నటించబోతున్నారు. ఒకవైపు తండ్రి బాలకృష్ణ, మరోవైపు వారసుడు మోక్షజ్ఞ ఒకే తెరపై కనిపిస్తే ఆ థియేటర్ల మోత ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవడం కష్టం. మోక్షజ్ఞ పాత్ర ఎలా ఉండబోతుంది? కథనంలో అతని పాత్ర ఎంత కీలకంగా ఉందనుంది అన్న దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

1991లో విడుదలైన 'ఆదిత్య 369' తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్‌సెట్టర్ గా నిలిచింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను అద్భుతంగా చూపించి, ఎప్పటికీ నిలిచిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఇప్పుడు 'ఆదిత్య 999' రూపంలో ఆ వారసత్వాన్ని మరింత ఘనంగా కొనసాగించబోతున్నారు. క్రిష్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడు, బాలయ్య, మోక్షజ్ఞల కలయిక ఈ సినిమాను అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిపివేస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే క్రిష్ ఈ మూవీ వర్క్ లో నిమగ్నమైనట్లు టాక్ వినిపిస్తోంది. 

ఈ 'ఆదిత్య 999'లో బాలకృష్ణ త్రిపాత్రాభినం చేయబోతున్నట్లు సమాచారం.  తన కుమారుడు మోక్షజ్ఞను సోలో హీరోగా పరిచయం చేయించడం కంటే తన సినిమాలో భాగం చేసి.. ఆ తర్వాత ఒంటరిగా మూవీస్ చేయించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  'ఆదిత్య 369'లో రాజులు, విజయనగర సామ్రాజ్యం వంటి అద్భుతాలు చూపించారు.  ఇప్పుడు 'ఆదిత్య 999'లో మరెన్ని కాలాలకు వెళ్తారో, భవిష్యత్తులో ఎన్ని అద్భుతాలు చూపిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.   క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు.  ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.