‘దసరా’ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

‘దసరా’ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?

విడుదల తేదీ : మార్చి 30, 2023
నటీనటులు : నాని, కీర్తి సురేష్
సంగీతం : సంతోష్ నారాయణన్
నిర్మాత‌ : సుధాకర్ చెరుకూరి
ద‌ర్శక‌త్వం : శ్రీకాంత్ ఓదెల

నాచురల్ స్టార్ నానీ, మహానటి కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శ్రీ రామ నవమి సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందే నాని న్యూ గెటప్, సాంగ్స్, ట్రైలర్, పాన్ ఇండియా ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచిన ఈ సినిమా... ప్రేక్షకుల అంచనాలని అందుకుందా లేదా చూద్దాం.

తెలంగాణ నేపథ్యంతో వస్తున్న చాలా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. తెలంగాణ సంస్కృతులు, జీవన విధానాల్ని కమర్షియల్ హంగులతో సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చి మంచి విజయాల్ని అందుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. ఇప్పుడు మాది అదే ఫ్లేవర్, లోకల్ కుర్రాడు డైరెక్ట్ చేసిన సినిమా అంటూ రిలీజ్ కి ముందే భారీ ప్రమోషన్స్ చేశారు మేకర్స్.

కథేమిటంటే..

గోదావరిఖని ప్రాంతలోని వీర్లపల్లి అనే సింగరేణి ఓపెన్ కాస్ట్ గ్రామంలో ఉండే ధరణి, సూరి, వెన్నెల... వాళ్ల దోస్తులు. ఆ ఊరిలో ఉండే ఒక వైన్స్. ఈ వైన్స్ ని దక్కించుకోవడం కోసం గొడవ పడే పెద్దమనుషులు. వాళ్ల చుట్టూ జరిగే కథే దసరా. తన చిన్నతనంలోనే దసరా పండగరోజు వెన్నలను చూసి లవ్ లో పడతాడు ధరణి. వెన్నెలని సూరి కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి... ఆ విషయం వెన్నెలకి తెలవనీయడు. ఇక వెన్నెల కూడా సూరిని ఇష్టపడ్తుంది. సూరి దోస్తాన్ కోసం ఇద్దరికీ దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాడు ధరణి. అయితే పెళ్లి రోజే సూరితో పాటు మరో ముగ్గురి ఫ్రెండ్స్ ని చంపేస్తారు. చంపింది ఎవరు? ఎందుకు చంపారు? బొగ్గు దొంగతనం చేస్తూ తాగుతూ జాలీగా తిరిగే తమ ఫ్రెండ్స్ ని ఒకేసారి చంపాల్సిన అవసరం ఎవరికుంది?? అనేదే ఇంటర్వెల్ ముందొచ్చే సీన్. ఆ సస్పెన్స్ మళ్లీ సీట్లో కూర్చొన్న ప్రేక్షకులకి చంపిందెవరో త్వరగానే సింపుల్ గా రివీల్ చేస్తాడు డైరెక్టర్. ఇక ఆ విలన్ పై ధరణి ఎలా రివేంజ్ తీసుకున్నాడు? అతని నుంచి వెన్నెలని ఎలా కాపాడాడు. తన ప్రేమని వెన్నెలకి చెప్పాడా? పిల్లికి కూడా బయపడే ధరణి... విలన్ ని ఎలా ఎదురించాడనేది తెరమీద చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఈ రొటీన్ క‌థ‌కు తెలంగాణలోని సింగ‌రేణి బ్యాక్‌ డ్రాప్ జోడించి రియ‌లిస్టిక్‌ గా స్క్రీన్‌ పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. అందులో ఒక లవ్ స్టోరీని యాడ్ చేసి... ఊళ్లో ఉండే రాజ‌కీయాలు, అక్కడి పంతాలు, ప‌గ‌ల‌ను చూపించే ప్రయత్నం చేశాడు. అయితే డైరక్టర్ ప్రయత్నం విఫలం అయిందనే చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కడా డెప్త్ ఉండదు. వెన్నెలపై ధరణికి ఉన్న ప్రేమని రివీల్ చేసే సీన్ సరిగ్గా రాసుకుని ఉంటే బాగుండేదేమో. పోనీ ఆ ఊళ్లోని రాజకీయాలను అయినా సరిగ్గా చూపించాడా అంటే అదీ లేదు. సవతి సోదరుల మధ్య రాజకీయం అంటూ కథను స్టార్ట్ చేసిన డైరెక్టర్... ఆ రెండు క్యారెక్టర్ల మధ్య వైరాన్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు. 

ప్లస్ లు మైనస్‌లు..

ధరణి పాత్రలో నాని జీవించేశాడు. ఎప్పుడు లవర్ బాయ్ లా కనింపిచే నాని... తన కొత్త లుక్స్ తో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సినిమా మొత్తం నాని ఒంటిచేతో నడిపించాడనొచ్చు. ఇక వెన్నెల క్యారెక్టర్ లో కీర్తీ సురేష్ బాగా నటించినా తన పాత్రకు పెద్దగా బలం లేకుండా పోయింది. నాని ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన దీక్షిత్ శెట్టి.. తాను నటిస్తుంది ఫస్ట్ సినిమానే అయినా ఎక్కడా అలా అనిపించదు. ఇక సాయికుమార్, సముద్రఖని లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందులో ఉన్నా.. వాళ్లని వాడుకోవడంలో ఆయా క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో డైరెక్టర్ ఫేయిల్ అయ్యాడనే చెప్పాలి.

టెక్నికల్ విషయాలు..

ఈ సినిమాలో ఛమ్కీల అంగీలేసి, ఓరి వారి లాంటి పాటలు బాగున్నాయి. రిలీజ్ కి ముందే ఈ పాటలు పాన్ ఇండియా వైడ్ గా చేసిన హంగామ మనకు తెలిసిందే. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ బాగుంది. అయితే ఫ్యామిలీతో సంతోషంగా చూసే మూవీ అని మేకర్స్ ప్రకటించినా.. ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీగానే నిలిచిపోయింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా... నాని యాక్టింగ్ ని ఇష్టపడేవాళ్లు మాత్రం ఈ సినిమాను చూడొచ్చు.

కొసమెరుపు : ఇదొక రొటీన్ కమర్షియల్ మూవీ