ఎన్టీఆర్కు వెల్ కం చెప్పిన లోకేష్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్..

ఎన్టీఆర్కు వెల్ కం చెప్పిన లోకేష్.. తారక్ ఫ్యాన్స్ ఫైర్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి మార్మోగుతోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని టీడీపీ నేతలు, అభిమానులు కోరుకుంటున్నారు. నారా లోకేష్ కూడా దీనిపై పాజిటివ్ గా స్పందించారు. అయితే తారక్ అభిమానుల్లో కొందరు మాత్రం సోషల్ మీడియాలో లోకేష్ ను ట్రోల్ చేస్తున్నారు. జూనియర్ రాజకీయాల్లోకి వస్తే వెల్ కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అసలు జూనియర్‭ని పార్టీలోకి ఆహ్వానించడానికి నువ్వెవరంటూ లోకేష్‭పై మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాత పెట్టిన పార్టీ టీడీపీ అని.. పార్టీపై చంద్రబాబు, లోకేష్ కన్నా ఆయనకే ఎక్కువ అధికారం ఉందంటున్నారు. తాను ఎప్పుడు రావాలనుకున్నా పార్టీలోకి వస్తాడని.. వెల్ కమ్ చెప్పడానికి మీరెవరు అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబే లోకేష్ తో ఇలా మాట్లాడించారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. 
 
అంతకు ముందు.. యువగళం పాదయాత్రలో భాగంగా హలో లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ స్టేజ్ పై ఉండగా కొందరు ఆయనకు ప్రశ్నలు సంధించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆయన్ను ఆహ్వానిస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, అలా వచ్చే అందర్నీ తాను ఆహ్వానిస్తానని చెప్పారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్‭లో మంచి మనసును చూశానని లోకేష్ వెల్లడించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.