టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు

టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే నారాయణ అరెస్టు
  • నారాయణ భార్యను మేం అరెస్టు చేయలేదు
  • చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు దొరకడం వల్లే నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను అరెస్టు చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు పేపర్ మాల్ ప్రాక్టీస్ కు గురైందని చిత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు నమోదు కావడంతో అప్రమత్తమై కేసు దర్యాప్తు చేపట్టగా.. టెక్నికల్ ఎవిడెన్స్ దొరకడంతో కొందరిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.

పట్టుపడిన వారిని విచారించగా నారాయణ విద్యా సంస్థల బ్రాంచ్ డీన్ బాలగంగాధర తిలక్ ను అదుపులోకి తీసుకుని ఆయనతోపాటు.. నారాయణకు కూడా సంబంధాలున్నట్లు ఆధారాలు దొరకడంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వెళ్లి అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకొచ్చామన్నారు.  మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం జరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులోనే నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. నిందితులపై ఐపీసీ 408, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. 
ప్లాన్ ప్రకారమే మాల్ ప్రాక్టీస్
మాల్ ప్రాక్టీస్ అంతా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైందని, గత నెలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టగా నిజమేనని గుర్తించామన్నారు. పరీక్షా కేంద్రాల్లో పనిచేస్తున్న అటెండర్లు, వాటర్ బాయ్ లు, ఇతర సహాయ సిబ్బంది, నిర్వాహకుల గురించి ముందే సమాచారం తెలుసుకుని.. సెంటర్లో పనిచేస్తున్న వారిలో తమకు అనుకూలమైన వారిని లొంగ దీసుకుని వారి ద్వారా మిగతా వారిని లొంగదీసుకుని నిరాటంకంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ముందుగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డొంకంతా కదలిందన్నారు. 
తమ వద్ద చదువుకునే విద్యార్థులను రెండు కేటగిరీలుగా విభజించి.. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామన్నారు.  బాగా చదివే వారిని ఒక కేటగిరి.. అంతగా చదవని వారిని మరో కేటగిరి కింద విభజించి వారికి మాల్ ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పేపర్ లీకేజీ అయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పకడ్బందీగా విచారణ జరిపామన్నారు. 
తిరుపతి  డీన్ బాలగంగాధర్ ని కూడా అరెస్టు చేశాం
నారాయణ అరెస్టుకు టెక్నికల్ ఎవిడెన్స్ ఉందని, తిరుపతి నారాయణ బ్రాంచ్ లు డీన్ బాల గంగాధర్ ను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ర్యాంకుల కోసమే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. తమ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో ముందు తెలుసుకుంటారని.. అడ్మిషన్లు పెంచుకునేందుకే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామన్నారు.

పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిస్తారని, హెడ్ ఆఫీసులో వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపిస్తారన్నారు. జవాబు పత్రాన్ని లోపలికి పంపడానికి వాటర్ బాయ్స్ లేదా.. ఇతరులు ఎవరైతే లొంగుతారో.. అలాంటే వారిని వాడుకున్నట్లు గుర్తించామన్నారు. ఈసారి ముందే అలర్ట్ కావడంతో మాల్ ప్రాక్టీస్ బయటపడిందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వివరించారు. గతంలోనూ ఇలాగే లీకులు చేశారా.. ? మిగతా విద్యా సంస్థలకు కూడా ఏమైనా పాత్ర ఉందా ? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ చెప్పారు.  సెక్షన్ 408, 409 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు వర్గాల కథనం. 

 

ఇవి కూడా చదవండి

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు