
- టీసీ ఇవ్వలేదని.. ఆత్మాహుతియత్నం
- ప్రిన్సిపల్ చాంబర్‌లో పెట్రోల్ పోసుకున్న స్టూడెంట్ లీడర్
- ప్రిన్సిపల్, ఏవో సహా నలుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి సీరియస్
- హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని నారాయణ కాలేజీలో ఘటన
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశం
- కాలేజీకి షోకాజ్ నోటీసులిచ్చిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ క్యాంపస్‌లో దారుణం జరిగింది. టీసీ కోసం వచ్చిన విద్యార్థులు, కాలేజీ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం పెట్రోల్ దాడికి దారి తీసింది. ఈ ఘటనలో కాలేజీ ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సహా నలుగురికి గాయాలయ్యాయి. రామంతాపూర్‌కు చెందిన సాయి నారాయణ గతేడాది అంబర్‌పేట్ నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఉండటంతో టీసీ ఇవ్వాలని కాలేజీ సిబ్బందిని అడిగాడు. ఈ విషయంపై తరచూ కాలేజీకి వచ్చి అడుగుతున్నాడు. పెండింగ్ ఫీజు కడితేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పింది. ఈ క్రమంలో సాయి నారాయణతో పాటు మరికొంత మంది శుక్రవారం కాలేజీ కి వచ్చారు. వీళ్ల తరఫున మాట్లాడేందుకు స్టూడెంట్ లీడర్లు సందీప్, వెంకటాచారిని తీసుకొచ్చారు. వీరంతా మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రిన్సిపల్ చాంబర్‌కి వెళ్లి, సాయి నారాయణ టీసీ ఇవ్వాలని అడిగారు. పెండింగ్‌లో ఉన్న రూ.16 వేల ఫీజును చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, ఏఓ అశోక్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డితో వాగ్వాదం జరిగింది.
దేవుడికి పెట్టిన దీపంపై పెట్రోల్
సాయి నారాయణకు టీసీ ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్టూడెంట్ లీడర్ సందీప్ పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగాడు. మధ్యాహ్నం 12.43 గంటలకు సందీప్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న దేవుడి ఫొటోల ముందు పెట్టిన దీపంపై పెట్రోల్ పడగా, ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సందీప్, అశోక్‌రెడ్డి, వెంకటాచారి తీవ్రంగా గాయపడ్డాడు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో సందీప్‌కి 65 శాతం, అశోక్ రెడ్డికి 50 శాతం, వెంకటాచారికి 30 శాతం కాలిన గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. సందీప్‌తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సందీప్ పరిస్థితి మరింత విషమించడంతో డీఆర్‌డీఓ అపోలో హాస్పిటల్‌కి తరలించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన..
నారాయణ కాలేజీలో ఫీజుల వేధింపులకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, డీవైఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో పోలీసులు స్టూడెంట్ యూనియన్ లీడర్లను అరెస్ట్ చేసి, మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారాయణ కాలేజీ ఘటనకు వ్యతిరేకంగా శనివారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు స్టూడెంట్ యూనియన్లు పిలుపునిచ్చారు. ఈ ఘటనపై అంబర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెండింగ్ ఫీజుల విషయంలో వాగ్వాదం జరిగిందని సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆవేశంలో సందీప్ పెట్రోల్ పోసుకోవడం, అది కాస్తా దేవుడికి పెట్టిన దీపంపై పడటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
విచారణకు మంత్రి ఆదేశం..
నారాయణ కాలేజీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, నారాయణ కాలేజీ ఘటనపై పూర్తి వివరాలివ్వాలని హైదరాబాద్ డీఐఈఓ ఆ కాలేజీ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లు ఆపితే చర్యలు: ఇంటర్ బోర్డు ఇంటర్ పూర్తయిన స్టూడెంట్ల సర్టిఫికెట్లను ఆపొద్దని బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ సూచించారు. స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రిన్సిపాళ్లది అని, వివిధ కారణాలతో సర్టిఫికెట్లు ఆపితే, ఆయా కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సర్కారు కాలేజీలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, వివిధ సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఏ కాలేజీల అయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తే ఆ జిల్లా డీఐఈఓకు, ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
ఇప్పటికైనా ఫీజులు నిర్ణయించండి
డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించినట్టుగానే, ఇంటర్ ప్రైవేటు కాలేజీల్లోనూ ఫీజులను నిర్ధారించాలి. స్టూడెంట్లకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా, టీసీలు ఇవ్వమంటే ఎట్ల? పిల్లలు ఫీజులు కట్టకుండా, సర్కారు స్కాలర్‌షిప్‌లు ఇవ్వకుండా కాలేజీలను ఎలా నడపాలి? ఈ బాధలన్ని తప్పాలంటే కాలేజీలను సర్కారు టేకోవర్ చేయాలి. ఫీజుల కోసం వేధిస్తున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై చర్యలు తీసుకోవాలి.
గౌరీ సతీశ్, ప్రైవేటు ఇంటర్ కాలేజీల మేనేజ్‌మెంట్ల సంఘం అధ్యక్షుడు
విద్యా శాఖ మంత్రి అసమర్థత వల్లే..
నారాయణ, శ్రీచైతన్య కాలేజీల కన్నుసనుల్లోనే ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ వచ్చాక ఆ విద్యాసంస్థల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాంటి విషయాలపై సమీక్షించి, నిర్ణయాలు తీసుకునే అధికారం ఆమెకు లేదు. ఆమె అసమర్థతతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజులపై సమగ్ర చట్టం తేవాలి.
మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్