- నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్
- కొత్త సర్పంచులకు మొదటి విడత శిక్షణ షురూ
మహబూబ్నగర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజలు మెచ్చేలా పాలన అందించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేటలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో సోమవారం కొత్తగా ఎన్నికైన సర్పంచుల మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, గుండుమాల్, మద్దూరు మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2018 పంచాయతీ రాజ్ చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిక్షణలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక క్లాస్ పెట్టించాలని డీపీవో సుధాకర్ రెడ్డిని ఆదేశించారు. డీఆర్డీడీవో మొగులప్ప, ఆఫీసర్లు పాల్గొన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్: గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 120 మంది సర్పంచులకు వివిధ అంశాల్లో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ పాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక నిర్వహణ, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, విపత్తుల సమయంలో సర్పంచుల పాత్ర, డిజిటల్ సైన్, ఆదర్శ గ్రామపంచాయతీల నిర్మాణం వంటి అంశాలను వివరిస్తారని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ దేవసహాయం, డీపీవో శ్రీరాములు, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ పాల్గొన్నారు.
సర్పంచుల పాత్ర కీలకం
ఇటిక్యాల, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఎర్రవల్లిలోని 10వ పోలీస్ బెటాలియన్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, విజయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్ పదవి అత్యంత కీలకమైందని, ప్రతి సర్పంచ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రతి వారం సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అభివృద్ధి కోసం సర్పంచులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. విద్య, వైద్యం, మహిళల సాధికారత, రైతుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణతో పాటు విస్తృతంగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగ్ రావు, గద్వాల ఏఎంసీ చైర్మన్ నల్ల హనుమంతు, డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్, బెటాలియన్ కమాండెంట్ జయరాజు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం కావాలి
వనపర్తి: గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం వైటీసీ భవనంలో కొత్త సర్పంచుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో సర్పంచులుగా పని చేసిన వారు తమ అనుభవాలను పంచుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచులకు శిక్షణ సామగ్రిని పంపిణీ చేశారు. డీపీవో తరుణ్, డీఎల్పీవో రఘునాథ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
గ్రామస్తులతో సామరస్యంగా మెలగాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్: కొత్త సర్పంచులు గ్రామస్తులతో సామరస్యంగా ఉంటూ అభివృద్దికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సూచించారు. కొత్త సర్పంచులకు నగరంలోని జడ్పీ మీటింగ్ హాల్లో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిష్పక్షపాతంగా పని చేసి మన్ననలు పొందాలని సూచించారు. పల్లె పాలనపై పట్టు సాధించి సుపరిపాలన అందించాలని కోరారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, ఇన్చార్జి డీపీవో వెంకట్ రెడ్డి, ట్రైనీ డీపీవో నిఖిల పాల్గొన్నారు.
