నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాను బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు, ప్రజలు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. మంగళవారం దామరగిద్ద మండలం కంసాన్‌పల్లి గ్రామంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల సంరక్షణ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.
చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, సామాజిక ఇబ్బందులు, బాల్య వివాహ నిరోధక చట్టం కింద తీసుకునే కఠిన చర్యల గురించి వివరించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావంపై బాలికలు అప్రమత్తంగా ఉండాలని, లక్ష్య సాధనే ధ్యేయంగా ఉన్నత చదువులు చదివి ఆర్థిక స్థిరత్వం సాధించాలని సూచించారు. బాలలపై జరిగే లైంగిక దోపిడీ నుంచి రక్షణ కల్పించే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం
నల్గొండ : నల్గొండ పట్టణంలోని రెడ్ క్రాస్ భవనంలో మంగళవారం మహిళా వారోత్సవాల సందర్భంగా ‘బాల్య వివాహ నిషేధ చట్టం-2006’పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్ చిన్నాభిన్నం అవుతోందని, వీటిని అరికట్టడంలో విద్యార్థులు చైతన్యవంతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులు లేదా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఆయన పట్టణంలోని ‘ప్రణామం’ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సందర్శించారు. వృద్ధులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
