మోడీ బయోపిక్ ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు

మోడీ బయోపిక్ ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు

గోవా : వచ్చే ఎన్నికలతో క్యాష్ చేసుకుందామనుకునే బయోపిక్ సినిమాలపై ఎన్నికల కోడ్ ప్రభావం పడనున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని బ్యాన్ చేసిన ఈసీ బయోపిక్ సినిమాలకు ఎలా అనుమతి ఇస్తుంది అంటూ కొన్ని యూనియన్లు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరారు. నరేంద్రమోడీ బయోపిక్‌ ను నిలిపివేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా.. ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికలకు ఒక రోజు ముందు విడుదలవుతోందని, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీకి ఇచ్చిన లెటర్ లో తెలిపింది. అంతే కాకుండా ఆ సమయంలో ఎలాంటి ప్రచారాలు అనుమతించబడవని, ఎన్నికల కోడ్ బలంగా ఉంటుందని అన్నారు.

ఎన్నికలకు 48 గంటల ముందు నరేంద్రమోడీ బయోపిక్‌ ను విడుదల చేయడం వెనక రాజకీయ ఉద్దేశమే ఉందని ఆరోపించింది NSUI. ఇది బీజేపీ ప్రచారానికి దోహదపడుతుందని అన్నారు. ఈ విషయమై గోవా NSUI అధ్యక్షుడు మాట్లాడుతూ ‘‘ప్రధానమంత్రిగా అన్ని రకాలుగా ఘోరంగా ఫెయిలైన మోడీకి ఈ సినిమా ఉచిత ప్రచారం చేస్తుంది. ఒక్క మోడీకే కాకుండా.. ఇది బీజేపీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సినిమాను థియేటర్లలోనే కాకుండా మరే విధానంలోనైనా విడుదల చేయడాన్ని అడ్డుకుంటాం’’ అని అన్నారు.