రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడనున్న మోడీ

రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడనున్న మోడీ

ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 24) రాత్రి మోడీ ఫోన్ చేయనున్నట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థుల భద్రత గురించి పుతిన్తో ఫోన్లో చర్చించనున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను హంగేరీ సరిహద్దుల ద్వారా తరలించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే హంగేరీ, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని జొహానైకు చేరుకున్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది అక్కడి ప్రభుత్వ సాయంతో ఇండియన్లను హంగేరీకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.