
- దేశాన్ని జైలుగా మార్చి నేటికి 50 ఏండ్లు
- రాజ్యాంగాన్ని రద్దు చేసి.. ప్రజాస్వామ్యాన్ని బంధించారు
- నాటి కాంగ్రెస్ పాలనపై ప్రధాని ఆగ్రహం
- రాజ్యాంగబద్ధమైన పాలన అందిస్తామని వెల్లడి
- ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 50 ఏండ్ల కింద జరిగిన పొరపాటు ఎన్నటికీ రిపీట్ కాకూడదని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని అప్పటి ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో ఇప్పటికీ గుర్తుందన్నారు. దేశాన్ని ముక్కలు చేసి.. జైలుగా మార్చి.. ప్రజాస్వామ్యాన్ని ఎలా బంధించిందో ఎవరూ మరిచిపోలేదని తెలిపారు. 1975 జూన్ 25న అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిందన్నారు.
మంగళవారంతో దీనికి 50 ఏండ్లు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సామాన్య ప్రజల కలలను నెరవేర్చేందుకు పార్లమెంట్లో తీర్మానం చేస్తామన్నారు. సోమవారం ఉదయం పార్లమెంట్‌కు చేరుకున్న మోదీకి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. 18వ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడారు. ‘‘18వ లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. వారందరినీ పార్లమెంట్ సమావేశాలకు స్వాగతం పలుకుతున్నాను.
దేశ ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్డీయే ప్రభుత్వానికి వరుసగా మూడోసారి అధికారం కట్టబెట్టారు. ఈ గెలుపు మాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన రెండో గవర్నమెంట్ మాదే. 60 ఏండ్ల తర్వాత ఈ అవకాశం దక్కింది. మూడుసార్లు అధికారం ఇచ్చారంటే మాపై బాధ్యత మరింత పెరిగింది. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని మోదీ అన్నారు.
మా బాధ్యత మూడు రెట్లు పెరిగింది
వికసిత్ భారత్ లక్ష్యంగా తమ పాలన సాగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మాకు భారీ విజయం అందించారు. దీంతో మా బాధ్యత కూడా మూడు రెట్లు పెరిగింది. మా మూడో టర్మ్ పాలనలో మూడు రెట్లు ఎక్కువ కృషితో అభివృద్ధి ఫలితాలు అందిస్తామని దేశప్రజలందరికీ హామీ ఇస్తున్నా. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటాం. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తాం’’ అని మోదీ అన్నారు.
ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి
ప్రతిపక్ష సభ్యులకు ప్రధాని మోదీ చురకలంటించారు. దేశానికి బాధ్యతాయుతమైన అపోజిషన్ కావాలని అన్నారు. ‘పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష సభ్యులు సహకరించాలి. స్నేహపూర్వక వాతావరణంలో ప్రతి సమస్యపై చర్చించేందుకు ముందుకు రావాలి. నిరసనల పేరుతో నినాదాలు చేస్తూ టైమ్ వేస్ట్ చేయొద్దు. డ్రామాలు అస్సలు చేయొద్దు. సభలో గందరగోళం సృష్టించొద్దు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అపోజిషన్ పార్టీల సభ్యులు వ్యవహరిస్తారని నేను ఆశిస్తున్నాను’ అంటూ మోదీ చురకలంటించారు. ప్రతి ఒక్క సభ్యుడూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
ఎంపీలుగా మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణం
18వ లోక్‌సభ సభ్యులుగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ఎంపీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులందరితో ప్రమాణం చేయించారు. దీనికి ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నేరుగా పార్లమెంట్‌కు చేరుకుని సభ్యులతో ప్రమాణం చేయించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. ఆ టైమ్‌లో ఎన్డీఏ సభ్యులు జై శ్రీరామ్ నినాదాలు చేయగా.. ప్రతిపక్ష సభ్యులు రాజ్యాంగ ప్రతులు చూపిస్తూ నిరసన తెలిపారు. తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేశారు.
వయనాడ్ సెగ్మెంట్‌కు రాహుల్ రిజైన్
వయనాడ్ సెగ్మెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ.. ప్రొటెం స్పీకర్‌కు రిజైన్ లెటర్ అందజేశారు. ఆయన దాన్ని పరిశీలించి ఆమోదించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్ ప్రమాణం చేశారు.
ప్రధాని ప్రమాణం చేస్తుండగా రాజ్యాంగ ప్రతితో రాహుల్ నిరసన
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ప్రొటెం స్పీకర్ భర్తృహరి తొలుత మోదీతో ఎంపీగా ప్రమాణం చేయించారు. మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన సీటులో నుంచి నిలబడి, ఓ చేతితో రాజ్యాంగ ప్రతిని పైకెత్తి చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై మోదీ,అమిత్ షాల దాడికి నిరసనగానే పార్లమెంట్లో రాజ్యాంగ ప్రతిని ప్రదర్శించినట్లు రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు.