
ఢిల్లీ : జైషే మహమ్మద్ భయానక దాడి తర్వాత యావత్ దేశం భగ్గున మండింది. ఆత్మాహుతి దాడికి వ్యతిరేకంగా కుల, మత, ప్రాంతా లకతీతంగా ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. టెర్రరిజంపై యుద్ధం ప్రకటించారు. టెర్రరిస్టులకు వెన్నుదన్నుగా నిలిచిన పాకిస్తాన్ నీతిని ఎండగట్టారు. పాక్ వ్యవహార శైలిని నిలదీశారు.‘భారత్ మాతాకీ జై ’ అంటూ దేశమంతా వినపడేలా నినాదాలు చేశారు. మన టీవీ చానెళ్లు, సోషల్ మీడియా ఈ దారుణానికి సంబంధించిన కథనాలతో దేశాన్ని యుద్ధం మూడ్ లోకి తెచ్చేశాయి. ఢిల్లీలో అమర జవాన్ల శవ పేటికల దగ్గర ప్రధాని మోడీ శ్రద్ధాంజలి ఘటించిన చిత్రాలు చూసిన తర్వాత ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోయారు.
ఎన్నికల యుద్ధంలో సగం గెలిచినట్లే!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఎంకే)లో ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్ )’ జరిపిన వీరోచిత దాడులతో ప్రధాని మోడీ గ్రాఫ్ టాప్ లోకి వెళ్లింది. త్వరలో జరగబోయే జనరల్ ఎలక్షన్‌లో సగం యుద్ధం గెలిచారు అంటున్నారు. ఆత్మాహుతి దాడి తర్వాత ‘దెబ్బకు దెబ్బ తీస్తాం ’ అనే సంకేతాలను దేశం నలుమూలలా పంపారు. ఇండియా శాంతిని ప్రేమించే దేశమే కాదు, అవసరమైతే శత్రు దేశాలతో అమీతుమీ తేల్చుకోవడానికి కూడా వెనకాడదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు ప్రజలు. ఐఏఎఫ్ దాడులతో సమర్థుడైన ప్రధానిగా మోడీ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు, శబరిమలలోకి మహిళల ప్రవేశం వంటి అనేక వివాదాలు తెర వెనక్కి పోయాయి. టెర్రరిస్టు దాడికి ఇండియా విజయవంతంగా ప్రతీకారం తీర్చుకుందన్న ఏకైక అంశమే తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు దేశ ప్రజల మనసుని మోడీ దోచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రధాని మోడీకి అండగా నిలబడ్డారు. సత్తా ఉన్న లీడర్ అంటూ అభినందనలు అందుకున్నారు మోడీ.