చూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం

చూస్తూ ఉండండి.. మూడోసారీ మోదీ ప్రధాని కావడం ఖాయం: యూపీ సీఎం

2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాముడి ఆశీర్వాదం లేకుండా ఏదీ జరగదని, గ్రామీణమైనా, పట్టణ ప్రాంతమైనా భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారని చెప్పారు. అయోధ్యలో జరగనున్న రామమందిరం కార్యక్రమంపై తన ఆలోచనలను పంచుకున్న సీఎం ఆదిత్యనాథ్.. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విరుచుకుపడ్డారు. 

రాముడిని అర్థం చేసుకోని వారందరికీ భారతదేశం అర్థం కాదని సీఎం యోగి అన్నారు. అయోధ్యలోని రామ మందిరానికి 'ప్రాణ ప్రతిష్ఠ' (పవిత్రోత్సవం) కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ మందిర నిర్మాణాన్ని చూడటం తమ అదృష్టం అని, రామ మందిరానికి క్రెడిట్ తీసుకోకుండా భక్తులుగా వెళ్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేకుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం అసాధ్యమన్నారు. 500 ఏళ్ల తర్వాత డజన్ల కొద్దీ తరాలు చూడలేని సమయం వచ్చిందన్న ఆయన.. తాను శ్రీరాముడి సేవకుడిగా అయోధ్యలో ఉంటానని సీఎం యోగి తెలిపారు.

రామ మందిర నిర్మాణం జాప్యానికి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేతలు ఆలయాలను సందర్శిస్తారని మండిపడ్డారు. ఐదేళ్ల తర్వాత అయోధ్యకు వెళ్లే ఎవరూ గుర్తించలేరని సీఎం అన్నారు. అయోధ్యలో 4 లేన్ల రోడ్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, మల్టీలెవల్ పార్కింగ్ ఉంటాయని ఎవరు ఊహించి ఉండరు కానీ నేడు ఆ కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. రానున్న పదేళ్లలో అయోధ్యకు లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు రానున్నాయన్నారు.