
మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా మోదీ నిలిచారు.
మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, సీషెల్స్, మాల్దీవ్స్ దేశాధినేతలను హాజరయ్యారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, రజినీ కాంత్, పలువురు ఎన్డీయే నేతలు, ఎంపీలు, పలురాష్ట్రాల సీఎంలు,ప్రముఖులు హాజరయ్యారు. మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ చుట్టూ మూడంచెల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో 543 సీట్లలో ఎన్డీయే కూటమి 293, ఇండియా కూటమి 232 స్థానాలు, ఇతరులు 18 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే..