వడ్డె గుడిసెలకు 20 మీటర్ల దూరం వరకు వచ్చిన నార్లాపూర్ నీళ్లు

వడ్డె గుడిసెలకు 20 మీటర్ల దూరం వరకు వచ్చిన నార్లాపూర్ నీళ్లు
  •     ఇప్పటికే 20 మీటర్ల దూరంలోకి వచ్చిన ‘పాలమూరు–రంగారెడ్డి’ వాటర్​
  •     43 కుటుంబాలు ఇక్కడే..
  •     సోమవారం 14 ఇండ్లు ఖాళీ  చేసి కొల్లాపూర్​కు.
  •     మరో టీఎంసీ నింపితే సున్నపుతండా వరకూ వచ్చే అవకాశం
  •     అక్కడ 70 పైగా గిరిజన కుటుంబాలు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కడతామంటే విలువైన తమ భూములిచ్చారు. నెత్తిన పెట్టుకుంటామన్న నాయకుల మాటలను నమ్మారు. పరిహారం కోసం ఏండ్ల కొద్దీ ఎదురుచూశారు. డబుల్​బెడ్​రూం ఇండ్లు కట్టించి పునరావాసం కల్పిస్తామంటే నిజమనుకున్నారు. ఇవేవీ జరక్కపోగా అన్నం పెట్టిన నేలను, ఉన్న ఇండ్లను ప్రాజెక్టు నీళ్లు కబళించడానికి వస్తుండడంతో వదిలివెళ్లలేక గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు నాగర్​కర్నూల్​జిల్లాలోని వడ్డె గుడిసెల నిర్వాసితులు.

నాగర్​కర్నూల్, వెలుగు :  పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్​రిజర్వాయర్​లోకి చేరుతున్న నీరు వడ్డె గుడిసెలకు 20 మీటర్ల దూరం వరకు వచ్చింది. ఇప్పటి వరకు విడతల వారీగా నడిచిన ఒక్క మోటార్​తో దాదాపు 1.10 టీఎంసీల నీరు చేరింది. దీంతో వడ్డె గుడిసెల్లోని 43 ఇండ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం 14 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లగా మరో 29 కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంకో టీఎంసీ నింపితే వడ్డె గుడిసెల మీదున్న సున్నపుతండా చుట్టూ నీరు చేరుతుంది. ఇక్కడ దాదాపు 70 పైగా గిరిజన కుటుంబాలున్నాయి. అంజనగిరి గ్రామానికి చెందిన వారు ముందు చూపుతో ఎల్లూరు మెయిన్ ​కెనాల్​కు రెండువైపులా ఇండ్లు కట్టుకున్నారు. వడ్డె గుడిసెలు, సున్నపుతండాకు చెందిన వారు మాత్రమే ఇప్పుడిక్కడ మిగిలిపోయారు. పూర్తి స్థాయిలో నీరు నింపితే దూల్యానాయక్​ తండానూ ఖాళీ చేయక తప్పదు.

ఇదీ కన్నీటి కథ

జిల్లాలోని నార్లాపూర్ ​రిజర్వాయర్​లో ముంపుకు గురవుతున్న వడ్డె సున్నపుతండా గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డె గుడిసెలు, దూల్యానాయక్​ తండా, అంజనగిరి, సున్నపుతండాల్లో 236 కుటుంబాలున్నాయి. ఇందులో జీవో 123 కింద భూ సేకరణ పరిహారం, ఆర్అండ్ఆర్​ ప్రకటించిన ప్రభుత్వం సవరించిన జీవో120 కింద కొన్ని కుటుంబాలను తొలగించింది.117 కుటుంబాలకు 2012 భూసేకరణ చట్టం కింద ఆర్అండ్ఆర్​వర్తింపజేయగా 2015 లో సవరించిన జీవో 120 కింద 119 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ ఇవ్వలేదు. దీంతో వీరంతా ఇప్పటికీ పోరాడుతున్నారు.  ముంపు గ్రామాల్లో నివసిస్తున్న వారిలో అత్యధికులు చెంచులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారు. 2015-–16లో ప్రభుత్వం భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.4.50 లక్షలు, ఇంటికి రూ.5 లక్షల చొప్పున
చెల్లించింది. కొన్ని కుటుంబాలు జీవో 120 పరిధిలోకి రావని అధికారులు వదిలేశారు. ముంపు గ్రామాల వారికి అమరగిరి నుంచి కొల్లాపూర్​కు వెళ్లే మార్గంలో గుట్టను సాఫ్​ చేసి ప్లాట్లు ఏర్పాటు చేశారు. అడవిలో నుంచి అడవిలోకి వెళ్లేది లేదని 43 కుటంబాలకు చెందిన నిర్వాసితులు మొండికేశారు. ఏ వసతులు లేని అక్కడికి వెళ్లి ఏం చేయాలని నిరాకరించారు. కానీ, ఊరిని నీళ్లు ముంచెత్తుతుండడంతో కొల్లాపూర్​కు తరలిపోవడానికి సిద్ధమవుతున్నారు.

సీఎం చెప్పినా ఏం కాలే...

2019 లో మొదటిసారి నార్లాపూర్​ పంప్​హౌజ్, అప్రోచ్​ కెనాల్, ఎల్లూరు లిఫ్టులను పరిశీలించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ​నార్లాపూర్​ కట్ట మీద మీటింగ్​పెడితే నిర్వాసితులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకు న్నారు. దీంతో నిబంధనల ప్రకారం జీవో 120కి లోబడి పరిహారం, పునరావాసం కల్పించాలని సీఎం ఆదేశించారు. కుదరని పక్షంలో ప్రభుత్వ పథకాలు అందేలా చూడమని చెప్పారు. అయినా ఇప్పటికీ చేసిందేమీ లేదు.  కానీ, నార్లాపూర్ ​రిజర్వాయర్ ​పరిధిలో  ముంపుకు గురయ్యే గ్రామాలు, తండాలకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశామని, ఖాళీ చేసి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.  

పక్క ఫొటోలో కనిపించే వృద్ధురాలి పేరు పార్వతమ్మ..ఉండేది నాగర్​కర్నూల్​ జిల్లా నార్లాపూర్​ రిజర్వాయర్​ లో మునుగుతున్న వడ్డె గుడిసెల తండాలో...నిర్వాసితురాలైన ఈమెకు సర్కారు 120 జీవో కింద ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో ఊరిని ఖాళీ చేయలేదు. రిజర్వాయర్​లో 1.10 టీఎంసీల నీరు చేరడంతో ఇప్పటికే 20 మీటర్ల దూరం వరకూ నీళ్లొచ్చాయి. తండాలో 43 కుటుంబాలున్నాయి. 14 కుటుంబాలు సోమవారం ఖాళీ చేసి కొల్లాపూర్​కు వెళ్లాయి. పార్వతమ్మ భర్త కాలు విరిగి మంచానికి పరిమితం కాగా, కొడుకు బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఏడుస్తోంది. ఖాళీ చేయడానికి సాయం చేయమని చుట్టుపక్కల వారిని వేడుకుంటోంది.  

మా సావు మమ్మల్ని సావుమని వదిలేసిన్రు

70 ఏండ్ల కింద గుడిసెలు వేసుకున్నం.  కూలీ నాలి చేసుకుని రెక్కల కష్టంతో ఇండ్లు కట్టుకున్నం. ఇంత భూమి సంపాదించుకున్నం. చేతకాని ఇద్దరు ముసలోళ్లం ఏడికిపోయి బతకాలే. ఎట్ల బతకాలే. ప్లాట్ అన్నరు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తమన్నరు. ఇప్పుడు నీళ్లు ఇడిసి మా సావు మమ్మల్ని సావుమని అంటున్నరు.  

– భాగ్యమ్మ, వడ్డె గుడిసెలు

మా గురించి ఆలోచించరా?

భూములు పోయినై, ఇండ్లు పోయినై, బతుకు దెరువు లేకుండా పోయింది. సాలీసాలని బతుకులైనై..ఇండ్ల స్థలాలు, పశువుల దొడ్లకు జాగా ఇస్తమన్నరు. ఇప్పుడు ఏదీ లేదు.. నీళ్లొస్తున్నయ్​ ఇండ్లు ఇడిసి పొమ్మంటున్నరు. ముసలోళ్లను, పశువులు, మేకలు, కోళ్లను తీసుకొని ఎక్కడికి పోవాలె.. మా గురించి అస్సలు ఆలోచించరా?  
‌‌‌‌
- నరసింహ, వడ్డె గుడిసెలు

ఇండ్ల కిరాయి కడ్తా

వడ్డె గుడిసెలు ఖాళీ చేసేవాళ్లు ఇండ్లు కిరాయికి తీసుకుని ఉంటే ఐదారు నెలల వరకు కిరాయి కడతా. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తా.
‌‌
- జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి