తెలంగాణకే తలమానికం.. నర్సంపేట అయ్యప్ప ఆలయం

తెలంగాణకే తలమానికం..  నర్సంపేట అయ్యప్ప ఆలయం
  • శబరిమల తరహాలో మండలకాల పూజలు
  •  నేడు పల్లివేట.. రేపు పంబా ఆరట్టు ఉత్సవాలు

నర్సంపేట, వెలుగు : నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా మారింది. పట్టణంలోని వరంగల్‌‌‌‌ రోడ్డులో 23 ఏండ్ల కింద వ్యాపారవేత్త  శింగిరికొండ రామాంజనేయులు, మరికొందరు ప్రముఖులు కలిసి దాతల సహకారంతో అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి కేరళలోని శబరిమలలో తరహాలోనే ఇక్కడ కూడా పూజలు జరుగుతుండడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడికి వచ్చి అయ్యప్ప మాల తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే ఆలయంలో ప్రతి ఏడాది మార్చిలో వందలాది మంది హనుమాన్‌‌‌‌ మాలలు సైతం వేసుకుంటున్నారు. టెంపుల్‌‌‌‌లో భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ALSO READ:డబ్ల్యూపీఎల్‌‌‌‌ కమిటీ హెడ్‌‌‌‌గా రోజర్‌‌‌‌ బిన్నీ


శబరిమల తరహాలో ఉత్సవాలు 


కేరళలోని శబరిమలైలో జరిగే ఉత్సవ బలి, క్షేత్ర బలి, పల్లివేట, పంబారట్టు, పడి పూజ కార్యక్రమాలను నర్సంపేట ఆలయంలో సైతం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పల్లివేట, శనివారం పంబా ఆరట్టు ఉత్సవాలను నిర్వహించనున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా పుంగావనం, జలక్రీడ కోసం మాధన్నపేట చెరువు వద్దకు తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. మండల కాల పూజలు ప్రారంభం అయ్యే నాటి నుంచి 41 రోజుల పాటు నిత్యాన్నదానం కూడా నిర్వహించనున్నారు. భక్తుల సహకారంతోనే నర్సంపేట అయ్యప్ప ఆలయం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని ఆలయ కమిటీ చైర్మన్‌‌‌‌ శింగిరికొండ మాధవశంకర్‌‌‌‌ చెప్పారు