టీఆర్ఎస్ నుంచి నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ సస్పెండ్

టీఆర్ఎస్ నుంచి నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ సస్పెండ్

టీఆర్ఎస్ నుంచి నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ సస్పెండ్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మురళీ యాదవ్ కు పార్టీ సముచిత స్థానం ఇచ్చిందన్న పద్మా దేవేందర్ రెడ్డి... ఆయన భార్యకు ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పదవి ఇచ్చిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఆయన మున్సిపల్ చైర్మన్ అని కూడా ఆమె గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా జిల్లా అధ్యక్షురాలైన నాతో, లేదా మంత్రి హరీశ్ రావ్ తో అంతర్గతంగా మాట్లాడాల్సింది గానీ... ఇలా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి వ్యతిరేకంగా మాట్లడటం కరెక్ట్ కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇటీవలే తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మురళీ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పైనా మురళీ యాదవ్ పలు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు, బీసీలకు సముచిత స్థానం లేదన్నారు. ఇతర పార్టీల్లో ఓడిపోయి... టీఆర్ఎస్ లోకి వస్తే పదవులు ఇచ్చారు గానీ లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు ఇవ్వడం లేదని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలను కేసీఆర్ అవమానిస్తున్నారన్న ఆయన.. తన భార్య జెడ్పీ ఛైర్ పర్సన్ గా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా జెడ్పీ సమావేశానికి సీఎం రాలేదన్నారు. గతంలో జెడ్పీ సమావేశానికి ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ వచ్చారు గానీ.. కేసీఆర్ రాలేదని ఆరోపించారు.