
- 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్ టాసీ పిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
గండిపేట, వెలుగు: గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక నైజీరియన్‌తో పాటు ఇద్దరు నగర వాసులు ఉన్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండలోని ఓ లగ్జరీ ప్లాట్‌ను అద్దెకు తీసుకొని నైజీరియాకు చెందిన విస్డమ్ ఓన్‌కేయా(22) గోపిశెట్టి రాజేశ్(40), వెస్ట్ గోదావరికి చెందిన బొమ్మ దేవర వీరరాజు(32) డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఇందులో నకిలీ పాస్‌పోర్టుతో నగరానికి వచ్చిన నైజీరియన్ ఉన్నాడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మొయినాబాద్ పరిధిలోని అజీజ్‌నగర్‌లోని ఫాం హౌస్‌లో మే 29న నిర్వహించిన రేవ్ పార్టీకి, మే31న మంగళగిరిలో ఫణిరాజ్ అనే వ్యక్తికి15 గ్రాముల కొకైన్ సరఫరా చేసినట్లు విచారణలో తేలిందన్నారు. డ్రగ్స్ కొన్న వారిలో ఫణిరాజ్, పవిత్రరెడ్డి, సతీశ్, సదాశివ, సుధీర్, భానులను పోలీసులు గుర్తించారు. 107 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎక్స్ టాసీ పిల్స్, ఆరు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ మొత్తం విలువ రూ. 30 లక్షలుఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.