
ఇండియన్ సహా 11 మంది ఆస్ట్రోనాట్లను ఎంపిక చేసిన నాసా
ఐఎస్ఎస్, ఆర్టిమిస్, మార్స్ మిషన్ల కోసం రెండేళ్ల ట్రైనింగ్
కెనడా స్పేస్ ఏజెన్సీ కోసం
మరో ఇద్దరికీ శిక్షణ
తొలిసారి గ్రాడ్యుయేషన్ సెర్మనీ.. 11 మందికి సిల్వర్ పిన్లు
నాసా.. ఆకాశంలో ఆస్ట్రోనాట్ల కోసం ఐఎస్ఎస్ అనే ఇంటిని కట్టింది. చందమామపై అడుగు పెట్టించింది. అక్కడితోనే అయిపోయిందా..? లేదు.. ఇంకా మిగిలే ఉంది! భూమికి అల్లంత దూరాన ఉన్న మార్స్‌ను అందుకోవాలనుకుంటోంది. దాని మీదా కాలుపెట్టాలని తహతహలాడుతోంది. తెలియని ఎన్నెన్నో వింతలు, విషయాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రయత్నిస్తోంది. అదొక్కటే కాదు, ఎన్నెన్నిసార్లు అందుకున్నా, ఇంకా ఇంకా చందమామ దగ్గరకు పోవాలి.. తన కడుపులోని మరిన్ని రహస్యాలను ఛేదించాలి.. అందుకే 2024లో ఆర్టిమిస్ అనే మరో కార్యాన్నీ భుజంపై వేసుకుంది. తొలిసారి మహిళను పంపించబోతోంది. మరి, ఆ ప్రయోగాలకు ఆస్ట్రోనాట్లు కావాలి కదా. అందుకే జల్లెడ పట్టి మరీ 13 మంది ఆస్ట్రోనాట్లను ఎంపిక చేసింది. రెండేళ్ల పాటు వారికి ట్రైనింగ్ ఇచ్చి ‘గ్రాడ్యుయేట్’ పట్టాలు ఇచ్చింది. వచ్చిన 18 వేల దరఖాస్తులను వడబోసి 13 మందిని ఎంపిక చేసింది. 2017లో మొదలైన ఆ ట్రైనింగ్ శుక్రవారంతో పూర్తయింది. ఎంపికైన ఆ ఆస్ట్రోనాట్లలో ఓ ఇండియన్ ఉన్నారు. ఆయన పేరు రాజా జాన్ వూర్పుతూర్ చారి (రాజా చారి).
మొదటిసారి గ్రాడ్యుయేషన్ సెర్మనీ
ఎంతో మంది ఆస్ట్రోనాట్లకు నాసా ట్రైనింగ్ ఇచ్చినా ఇప్పటిదాకా ఎప్పుడూ గ్రాడ్యుయేషన్ సెర్మనీని చేయలేదు. కానీ, మొదటిసారి శుక్రవారం గ్రాడ్యుయేషన్ సెర్మనీ చేసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్లో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. నిజానికి 13 మంది ఆస్ట్రోనాట్లకు గ్రాడ్యుయేట్ పట్టాలు ఇచ్చినా, అందులో నాసా కోసం పనిచేసేది మాత్రం 11 మందే. మిగతా ఇద్దరు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్లుగా పనిచేస్తారు. కొత్తగా వచ్చిన ఆస్ట్రోనాట్లతో నాసాలోని మొత్తం యాక్టివ్ ఆస్ట్రోనాట్ల సంఖ్య 48కి చేరింది. ఆర్టిమిస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించినప్పటి నుంచి వాళ్లకు ఇలా గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ ఇవ్వడమూ ఇదే మొదటి సారి. ఎంపికైన వాళ్ల సేవలను వివిధ ప్రయోగాల కోసం వాడుకుంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్), ఆర్టిమిస్, 2030లో చేపట్టనున్న మార్స్ మిషన్లలో భాగంగా వాళ్లను అంతరిక్షంలోకి పంపిస్తారు.
సిల్వర్ పిన్.. స్పేస్‌లోకి పోతే గోల్డ్పిన్
11 మంది ఆస్ట్రోనాట్లకు సిల్వర్ పిన్‌లను నాసా అందించింది. ఇలా సిల్వర్ పిన్‌లను ఇచ్చే సంప్రదాయం నాసాలో ఎప్పటి నుంచో ఉంది. 1959లో తొలిసారిగా మెర్క్యురీ 7 ప్రయోగంలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లకు సిల్వర్ పిన్‌లను అందించింది. ఇప్పుడు ఎంపికైన ఆస్ట్రోనాట్లు మొదటి స్పేస్ ఫ్లైట్‌ను పూర్తి చేస్తే ‘గోల్డ్ పిన్’ ఇస్తారు. ఇప్పటిదాకా స్పేస్‌లోకి వెళ్లిన 500 మంది జాబితాలో ఈ 13 మందీ చేరే గౌరవం దక్కించుకున్నారు.
ఇదీ ట్రైనింగ్
రెండేళ్ల ట్రైనింగ్‌లో ఆస్ట్రోనాట్లకు స్పేస్‌వాక్‌లో ఇన్స్ట్రక్షన్, ప్రాక్టీస్, టెస్టింగ్‌పై క్లాసులు చెప్పారు. వాటితో పాటు రోబోటిక్స్, ఐఎస్ఎస్లోని సిస్టమ్స్, టీ38 జెట్ప్రొఫిషియెన్సీ క్లాసులు నిర్వహించారు. అంతేగాకుండా రష్యా ఆస్ట్రోనాట్లు, రష్యా స్పేస్ ప్రయోగాల గురించి తెలుసుకునేలా రష్యన్ లాంగ్వేజ్‌ను ట్రైనింగ్‌లో భాగం చేశారు. అంతేగాకుండా స్పేస్‌క్రాఫ్ట్ తయారీలోనూ వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక, స్ప్రింగ్ (వసంత కాలం) సీజన్లో మరో బ్యాచ్ ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు నాసా కసరత్తులు చేస్తోంది.
వీళ్లే ఆ 13 మంది
రాజా చారి, కైలా బారన్, జీనా కార్డ్‌మన్, మాథ్యూ డొమినిక్, బాబ్ హైన్స్, వారెన్ హోబర్గ్, డాక్టర్ జానీ కిమ్, జాస్మిన్ మోఘ్‌బెలి, లోరల్ ఒహారా, డాక్టర్ ఫ్రాన్సిస్కో ఫ్రాంక్ రూబియో, జెస్సికా వాట్కిన్స్, జోషువా కుత్రిక్ (కెనడా స్పేస్ ఏజెన్సీ), జెన్నిఫర్ సైడీ గిబ్బన్స్ (కెనడా స్పేస్ ఏజెన్సీ). ‘‘అమెరికాలోని ఉత్తమ వ్యక్తుల్లో వీళ్లూ ఉంటారు. నాసా ఆస్ట్రోనాట్కార్ప్స్లో చేరడం వాళ్లకు మరువలేని అనుభూతి. అమెరికా గడ్డ మీది నుంచి అమెరికా రాకెట్లలో అమెరికా ఆస్ట్రోనాట్లను పంపించేందుకు 2020 గట్టి పునాది వేస్తుంది. ఆర్టిమిస్ ప్రోగ్రామ్, అంతకుమించిన ప్రోగ్రామ్‌లకూ ఈ ఏడాది చాలా ముఖ్యమైనది’’ అని నాసా చీఫ్ జిమ్ బ్రైడెన్‌స్టైన్ అన్నారు.
చదువు ఓ వరం
చదువు ఓ వరం అని అంటున్నారు రాజా చారి. ‘‘చదువు ఓ వరం అన్న ఆలోచనలతోనే నేను పెరిగాను. అయితే, ఆ చదువును ఇష్టమొచ్చినట్టు వాడుకోకూడదు’’ అని ఆయన అన్నారు. అమెరికాలోని అయోవాలో ఉంటున్న రాజా, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సైన్సెస్‌లో డిగ్రీ పట్టా పొందారు. యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ చదివారు. తర్వాత అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా విధులు నిర్వర్తించారు. ఎఫ్35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎఫ్35, ఎఫ్15, ఎఫ్16, ఎఫ్18 వంటి యుద్ధవిమానాలను 2 వేల గంటల పాటు నడిపిన అనుభవం రాజా సొంతం. అంతేగాకుండా ఇరాక్ ఫ్రీడమ్‌లో భాగంగా ఎఫ్15ఈ కంబాట్ మిషన్‌లోనూ పాల్గొన్నారు.