అమృత్ ప్లాన్ సమర్థంగా రూపొందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

 అమృత్ ప్లాన్ సమర్థంగా రూపొందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: అమృత్ 2.0 పథకం కింద జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ ను సమర్థంగా రూపొందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో డీటీసీపీ జాయింట్​డైరెక్టర్, అమృత్ 2.0 నోడల్ ఆఫీసర్ ​అశ్విని, మంచిర్యాల డీటీసీపీవో సంపత్ తో కలిసి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు మొదటి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ మ్యాపింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని, నూతన డేటా ఆధారంగా ప్లాన్‌లను రూపొందించాలని చెప్పారు. ఉద్యానవనాల ఏర్పాటు, పచ్చదనం, ప్రతీ ఇంటికి తాగునీరు, కాలుష్య నియంత్రణతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. 

మందమర్రి కేజీబీవీ తనిఖీ

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజన పథకం కింద పౌష్టికాహారం అందిస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలిపారు. బుధవారం మందమర్రిలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, వంట గది, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, శుద్ధమైన తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. టీచర్లు పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని పేర్కొన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో మందమర్రి డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఆర్ఐ రాథోడ్​గణపతి​తదితరులున్నారు.