పిల్లల మనసు గెలుచుకున్న ఉమేశ్

పిల్లల మనసు గెలుచుకున్న ఉమేశ్

బడిలో సౌకర్యాల కోసం డబ్బులు కావాలని గవర్నమెంట్​కి లెటర్ రాశాడు. రిప్లయ్​ రాలేదు. అలాగని నిరుత్సాహపడలేదు. ఎన్జీవోలు, డోనర్స్​ సాయం కోరాడు. ఫండ్స్ చాలకపోవడతో సొంత డబ్బు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలు కల్పించాడు. అంతేకాదు ఆ ఊళ్లోని మూఢనమ్మకాన్ని కూడా పోగొట్టాడు. అందుకుగానూ పోయిన ఏడాది ‘ఉత్తమ టీచర్’​గా రాష్ట్ర అవార్డు అందుకున్నాడు. పాఠాలు చెప్పడంతో పాటు పిల్లల మనసు గెలుచుకున్న ఇతనుఈ ఏడాది‘ నేషనల్ టీచర్​​ అవార్డు’ కూడా సాధించాడు. పేరు ​టి.పి.ఉమేశ్. కర్నాటకలో లోయర్ ప్రైమరీ స్కూల్లో టీచర్​. 

ఉమేశ్​కు 2004లో ప్రైమరీ టీచర్​ ఉద్యోగం వచ్చింది. బళ్లారి జిల్లాలోని చిక్ బళ్లారిలో మొదటి పోస్టింగ్. ఆ తర్వాత చిత్రదుర్గ జిల్లాలోని అమృతపుర అనే గిరిజన గ్రామంలోని స్కూల్​కి ట్రాన్స్​ఫర్ అయ్యాడు. అతను అక్కడ చేరేసరికి ఆ స్కూల్లో 39 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. అంత తక్కువ మంది స్టూడెంట్స్​ ఉండడానికి కారణం ఏంటో  స్కూల్​ కండిషన్​ చూడగానే అర్థమైంది ఉమేశ్​కు. మూడు గదులున్న స్కూల్​ బిల్డింగ్ కూలిపోవడంతో టెంట్లు, చెట్ల కిందనే  క్లాస్​లు చెప్పాల్సి వచ్చేది. అంతేకాదు తాగునీరు, టాయిలెట్స్​ వంటి కనీస సౌకర్యాలు ​ లేవు. ‘ఫెసిలిటీస్​ కల్పించండ’ని అధికారులకు లెటర్ రాశాడు ఉమేశ్​. వాళ్ల నుంచి రెస్పాన్స్ రాలేదు.  చెట్ల కింద ఎండావానకు పిల్లలు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోయాడు.  గవర్నమెంట్ సాయం కోసం ఎదురుచూడకుండా డోనర్స్​, ఎన్జీవోలని సాయం కోరాడు.  

చిన్న ప్రయోగశాల ఉంది

‘వన్​ స్కూల్​ ఎట్​ ఏ టైమ్’ అనే ఎన్జీవో​, రోటరీ క్లబ్ బెంగళూరు  సంస్థలు  రూ.30 లక్షల ఖర్చుతో  నాలుగు గదుల స్కూల్​ బిల్డింగ్, టాయిలెట్స్ కట్టించాయి. కొందరు డోనర్స్​ 30 చెక్క బెంచీలు, 60 రీడింగ్ టేబుల్స్​ ఇప్పించారు.  అంతేకాదు  కంప్యూటర్​ ల్యాబ్ ఏర్పాటు చేశారు.  కర్నాటకలోని ప్రైమరీ గవర్నమెంట్​ స్కూల్స్​లో మినీ లాబోరేటరీ  ల్యాబ్​ ఉన్న స్కూల్ ఇదే. ఫండ్స్​ చాలకపోవడంతో సొంత డబ్బు రూ. 20 వేలు ఖర్చు చేసి స్కూల్​ బిల్డింగ్, కాంపౌండ్ వాల్​కి పెయింటింగ్​ వేయించాడు​. ఒకప్పుడు పిల్లల్ని ఈ స్కూల్​కి పంపడానికి ఇష్టపడని  తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా వాళ్లని ఈ  స్కూల్లోనే చేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 64 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 

మూఢనమ్మకాన్ని పోగొట్టాడు

కరోనా టైంలో  ఆన్​లైన్ క్లాస్​లు మొదలయ్యాయి. అయితే అప్పటికప్పుడు స్మార్ట్​ఫోన్​ కొనిచ్చే స్థోమత లేదు ఆ పిల్లల తల్లిదండ్రులకు. దాంతో పిల్లలు పాఠాలు మిస్​ కాకూడదని సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్లోనే ఉండి వాళ్లకు క్లాస్​లు చెప్పాడు ఉమేశ్​. బడికి రాని పిల్లలకు ఇంటి దగ్గర, ఊళ్లోని గుడిలో మరీ పిల్లలకు పాఠాలు చెప్పేవాడు.  అంతేకాదు ఊరి ప్రజల మూఢనమ్మకాన్ని కూడా పోగొట్టాడు. నెలసరి టైంలో ఆడవాళ్లని ఊరవతలకి పంపించే ఆచారం ఉండేది ఆ ఊళ్లో. గ్రామస్తులతో మాట్లాడి వాళ్లలో మార్పు తెచ్చాడు.  రచయిత కూడా అయిన ఉమేశ్​ ఆరు పుస్తకాలు రాశాడు.

కాన్ఫిడెన్స్ పెరిగింది

‘‘స్కూల్లో ఫెసిలిటీస్​ లేవని కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదనిపించింది. అందుకనే డోనర్ల సాయంతో స్కూల్లో ఫెసిలిటీస్​ కల్పించాలనుకున్నా. నా ప్రయత్నం ఫలిచింది.  స్కూల్​ బిల్డింగ్​తో పాటు అన్ని సౌకర్యాలు ఉండడంతో  పిల్లలు రెగ్యులర్​గా బడికి వస్తున్నారు. వాళ్లలో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. కొంతమంది పిల్లలు ఆల్​ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్​ కూడా చేస్తున్నారు” అని చెప్పాడు ఉమేశ్​.