మేడిగడ్డ డిజైన్లు చేసిందెవరు?

మేడిగడ్డ డిజైన్లు చేసిందెవరు?

కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని.. తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు, ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎక్స్ పర్ట్ టీమ్, విజిలెన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులను విచారించారు. ఎన్డీఎస్ఏ విచారణ సమయంలో బ్యారేజీ నిర్మాణం, డిజైన్లపై ఇరిగేషన్ ఇంజనీర్లు ఒకలా చెప్తే.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధుల వాదన ఇంకోలా ఉంది. మేడిగడ్డ డిజైన్లను తాము ఫైనల్ చేయలేదని ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇంజనీర్లు చెప్పారు. 

ఎల్ అండ్ టీ నే డిజైన్ చేసుకుందని, తమను ఒత్తిడి చేయడంతోనే వాటికి ఆమోదం తెలిపామని సీడీవో ఇంజనీర్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఎల్ అండ్ టీ ప్రతినిధులు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లతోనే తాము బ్యారేజీ నిర్మించామని, డిజైన్లకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. డిజైన్ల మార్పులపై తాము హెచ్చరించినా ఇంజనీర్లు పట్టించుకోలేదని చెప్పారు. ఫీల్డ్ ఇంజనీర్లు చెప్పిన దానికి విరుద్ధంగా ఎల్ అండ్ టీ ప్రతినిధులు స్టేట్ మెంట్ ఇవ్వడంతో అసలు ఏం జరిగిందో తేల్చడంపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. డిజైన్ల మార్పులకు గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.