
- భైంసా నుంచి నిర్మల్ వరకు నాలుగు వరుసల రోడ్డు
- 53 కిలోమీటర్లకు ఆమోదం
- డీపీఆర్ సిద్ధం చేయాలంటూ ఉత్తర్వులు
- తగ్గనున్న రోడ్డు ప్రమాదాలు
నిర్మల్, వెలుగు: ఇప్పటివరకు టూ లేన్‌గా ఉన్న నేషనల్ హైవే 61 ఇక ఫోర్ లేన్‌గా మారనుంది. మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి భైంసా మీదుగా నిర్మల్ వరకు ఉన్న నేషనల్ హైవేను ఇక ఫోర్ లేన్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఓఆర్ టీహెచ్) అనుమతులు జారీచేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 15 హైవేల విస్తరణ చేపట్టనుండగా.. భైంసా–నిర్మల్ హైవే 61కు కూడా అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భైంసా నుంచి నిర్మల్ వరకు టూ లేన్ హైవే ఉన్న కారణంగా ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఎక్కడా బైపాస్‌లు లేకపోవడంతో ఈ రోడ్డు ప్రధాన గ్రామాల మీదుగానే వెళ్తోంది. ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుగుతుండడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
300 యాక్సిడెంట్లు.. 150 మంది మృతి
ఈ ఫోర్ లేన్ హైవేతో రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలోనే ఈ రోడ్డు డేంజర్ జోన్‌గా మారింది. కేవలం 5 నెలల్లో ఈ రోడ్డుపై 300కు పైగా ప్రమాదాలు జరిగాయి. 150 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఉన్న టూ లేన్‌కు ఇరువైపులా గ్రామాలు ఉండడం, అలాగే రోడ్డు తక్కువ వెడల్పుతో ఉన్న కారణంగా ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మార్గంలో ఫోర్ లేన్ నిర్మించనున్నారు. అలాగే కొన్ని ప్రధాన గ్రామాల సమీపంలో బైపాస్ ను నిర్మించనుండడంతో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
అలైన్మెంట్ ఆధారంగా భూసేకరణ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టనున్న ఫోర్ లేన్ నిర్మాణం కోసం అలైన్మెంట్ ఖరారు చేయనున్నారు. దీని ఆధారంగా అవసరమైన మేరకు భూసేకరణ కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు డీపీఆర్‌లో పూర్తి వివరాలు పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. 53 కిలోమీటర్ల మేర 200 అడుగుల వెడల్పుతో రోడ్డు మధ్యలో డివైడర్లతో ఫోర్ లేన్ కోసం భూసేకరణ చేపట్టనున్నారు. ఈ మార్గమధ్యంలోని కొన్ని పెద్ద గ్రామాల వద్ద తప్పనిసరిగా బైపాస్ రోడ్డును నిర్మించాల్సి ఉంటుందని, దీని ప్రకారం భూసేకరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2028 వరకు పనులు పూర్తిచేయాలని ఎంఓఆర్టీహెచ్ లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యేలు
నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలను కలిపే ఈ రహదారిని ఫోర్ లేన్‌గా చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలపడం హర్షనీయమని ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ అన్నారు. ఈ రోడ్డు సమస్యను వివరిస్తూ గతంలో మంత్రికి వినతిపత్రం అందజేశామని, తమ వినతిని పరిగణలోకి తీసుకొని ఫోర్ లేన్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.