V6 News

మాలల సంఖ్యను తగ్గిస్తే చరిత్ర మారుతుందా?

మాలల సంఖ్యను తగ్గిస్తే  చరిత్ర మారుతుందా?

కులగణన లేకుండా సామాజిక న్యాయం ఎండమావిలా కనిపిస్తుంది. చేతికి అందదు.  అలాంటి కులగణన ఆధిపత్య కులాలకు భజనలాగ మారితే?  సరిగ్గా ఇదే పరిస్థితిని తెలంగాణలో  కుల జనగణన విషయంలో  మాలలు ఎదుర్కొంటున్నారు.  తెలంగాణ వస్తే చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో చిన్న కులాల అభివృద్ధికి తోడ్పాటు  జరుగుతుందని భావించి కొట్లాడినం.  కానీ, వచ్చిన తెలంగాణలో  నేటికీ బాధితులుగా ఉన్నారు మాలలు. 

తెలంగాణ రాగానే మాలల చేతిలో  నుంచి భూమిని డంపింగ్ యార్డ్,  పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక,  ప్రభుత్వ కార్యాలయాలు,  పార్టీ  కార్యాలయాల కోసం అసైన్డ్  భూముల పేరుతో  మా భూములు వేల ఎకరాలు లాక్కున్నారు.  దానికి గజ్వేల్  నియోజకవర్గంలో ఆత్మబలిదానం చేసుకున్న బ్యాగరి నరసింహులు ఒక ఉదాహరణ. తర్వాత  వర్గీకరణ అంశాన్ని  తీసుకువచ్చి ఏకపక్షంగా మాలల  మూలాలను  ధ్వంసం చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి అంబేద్కర్  స్ఫూర్తిని  దళితుల ఐక్యతను  దెబ్బతీశారు.  

  • ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి

సీఎం  రేవంత్ రెడ్డి 2025  ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున జీవో నెంబర్ 99 తీసుకువచ్చి రోస్టర్ లో  సవరణ చేసి మాలలకు  తీవ్ర అన్యాయం చేశారు.  ఇప్పటికీ  వందల  పోస్టులు వచ్చిన  షెడ్యూల్ క్యాస్ట్ గ్రూప్ -3లోని  మాల దాని 26 అనుబంధ కులాలకు  ఒక్క పోస్ట్  రాకపోవడం మాలల విద్యా ఉద్యోగ భవిష్యత్తును చిదిమి వేయడమే.   సీఎం రేవంత్ రెడ్డి  ఎంతో  ప్రతిష్టాత్మకంగా  తీసుకున్నట్లు  చెబుతున్న  తెలంగాణలో  కుల జనగణనను  ఏ కులం జనాభా ఎంతో  బహిరంగంగా ప్రభుత్వం  ఇటీవలే  అధికారికంగా  ప్రకటించడం జరిగింది. 

అసలు సమస్య ఇక్కడే  మాలలుగా మాకు మొదలైంది.  మేధావులు,  రాజకీయ  పండితులు,  ప్రభుత్వ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.   సేకరించిన  సమాచారం మేరకు  ఒక్కసారి చరిత్ర లోతుల్లోకి తొంగి చూస్తే 1971 జనాభా  లెక్కలలో  మాల జనాభా 17,45,466 లక్షలు,  మాదిగ జనాభా 21,47,879  లక్షలు నమోదు చేయడం జరిగింది.  ఇక్కడ ఇరు కులాల మధ్య తేడా నాలుగు లక్షల రెండువేల నాలుగు వందల  పదమూడు తేడాను  గమనించవచ్చు.

  • ఈ లెక్కల తీరేందో సమాజం  గమనించాలి

1991 -– 94 జనాభా లెక్కల ప్రకారం మాదిగ జనాభా 24,76,865, లక్షలు,  మాలల జనాభా 15, 91,577 లక్షలు.   ఇక్కడ  రెండు కులాల మధ్య తేడా   8,85,248 లక్షలు. చూడవచ్చును. 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 32, 33,000 లక్షలు,  మాలల జనాభా 15,27,000 లక్షలు, ఇక్కడ  గమనిస్తే  మాదిగ కుల జనాభాలో మాలలు సగం కూడా లేనట్లు కనిపిస్తుంది,  తెలంగాణ వచ్చాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  సమగ్ర కుటుంబ  సర్వే  తెలిసిందే. నాటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 2011 తర్వాత  మూడేళ్లకే మాదిగల  జనాభా  34,87,000 లక్షలు,  మాలల జనాభా 14,35,000  లక్షలుగా చూపించడం జరిగింది.  

మూడేళ్లకే  మాదిగల జనాభా  రెండు లక్షల పెరిగితే  మాలల  జనాభా లక్ష పైచిలుకు తగ్గింది. ఈ లెక్కల  తీరేందో సమాజం  గమనించాలి.  చివరగా నేటి సీఎం రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి అధికారికంగా ప్రకటించిన జనగణనలో మాలల జనాభా 14,72,000  లక్షలు, మాదిగల జనాభా 36,58,000 లక్షలు,  అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గ జనాభా చూస్తే 17 లక్షల పదివేలుగా నిర్ధారించడమైనది. 

  • పాలకుల విడ్డూరం

ఒక్కసారి 1971 నుంచి  2026 వరకు ప్రకటించిన జనాభా లెక్కల తీరును పరిశీలిస్తే అన్ని కులాల జనాభా పెరుగుతూ వస్తుంటే విచిత్రంగా మాల సామాజిక వర్గ జనాభా మాత్రం రెండింతలు తగ్గుతూ వచ్చింది. 1971లో  మాల, మాదిగల మధ్య తేడా సుమారు నాలుగు లక్షలు మాత్రమే కాగా 2026 కు వచ్చేసరికి ఏకంగా 22 లక్షలకు తేడా పెరిగింది.  

సహజంగా ఏ సామాజిక వర్గమైన కుటుంబాలు పెరిగేకొద్దీ తమ జనాభా పెరుగుతూ వస్తుంది. ఎంత జనాభాను అరికట్టిన ఎంత డైవర్షన్ జరిగినా ఇంత తేడా అనేది సహజంగా ఏ కులాల మధ్యలో ఉండదు.  కానీ,  మిగతా కులాలతో మాల సామాజిక వర్గాన్ని పోల్చుకుంటే సగానికి సగం తగ్గటం కాదు తగ్గిస్తూ తప్పుడు  లెక్కలుగా  చూపించారు అనేది ముమ్మాటికి నిజం.  

ఎక్కడో  ఒకచోట  గుంపులుగా ఉండే  రెడ్డి సామాజిక వర్గ గృహాలు నేడు 17 లక్షల జనాభా దాటితే  తెలంగాణలో దాదాపుగా మాల ఇల్లు లేని గ్రామం ఉండని నేపథ్యంలో, వేల గ్రామాలలో  ఒకే సమూహంగా 300  గడపతో  జీవనం కొనసాగిస్తున్న చరిత్ర  సజీవంగా  గ్రామాలలో మాలలకు ఉన్నది.  అయినప్పటికీ  రెడ్డి సామాజిక వర్గం కంటే తక్కువ చూపించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది!  మాలల్ని సామాజిక సమాధి చేయడానికి ఒక కుట్రపూరితంగా పాలకులు పనిచేయడం విడ్డూరం.

  • పౌర సమాజం  క్షేత్రస్థాయిలో  పరిశీలించాలి

ఈ లెక్కలను  ఒక్కసారి  పౌర సమాజం  క్షేత్రస్థాయిలో  పరిశీలించాలి.  ఈ జనగణన  లెక్కలు  ఆధిపత్య  కులాలకు  భజనలాగ మారాయి.   మీ అస్తిత్వాలను  ఆస్తులను పెంచుకోవడానికి  మా మాలల  మూలాలను ధ్వంసంచేసే హక్కు  మీకు  ఎవరు ఇచ్చారు?   వేల ఏళ్లుగా  అణచివేత  అసమానతలను  భరించాం,  ఇప్పుడు  అణచివేతను  లెక్కల్లో దాచేస్తున్నారు.  అడుగడుగునా మాలలపై  ద్వేషాన్ని తెలంగాణ మొదటి నుంచి  నేటి వరకు వివిధ రూపాలలో చూపిస్తున్నారు.  

మాలలను  సంఖ్యలో తగ్గిస్తే  చరిత్ర  మారుతుందా?  మాల త్యాగాలను మార్చగలరా?  ఒక్కసారి  ఆలోచించుకోవాలి.  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  చెప్పినట్లు  సమానత్వం సాధించాలంటే  ముందు అసమానతలు లెక్కించాలి.  కానీ,   అసమానతలు లెక్కించడంలో కూడా వివక్షతను ప్రదర్శించడం ఎంతవరకు సబబు?  ఇప్పటికైనా  కులజనగణనలో మాలల లెక్క సరిచేయండి.  లేదంటే జనం మీ లెక్కలు సరిచేసే పరిస్థితి వస్తుంది.  ఎందుకంటే  ఇది  అంబేద్కర్ కాలం తలవంచుకొని ఉండే కాలం కాదు.  తలెత్తుకొని అడిగేకాలం!

- పిల్లి సుధాకర్
రాష్ట్ర అధ్యక్షుడు, 
జాతీయ మాల మహానాడు,
తెలంగాణ