ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్,వెలుగు: జాతీయ క్రీడారంగంలో హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ సేవలు చిరస్మరణీయమని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం ధ్యాన్ చంద్ జయంతి పురస్కరించుకుని జిల్లా క్రీడా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాలతో కలిసి హాజరై ధ్యాన్ చంద్ ఫొటోకు నివాళులు అర్పించారు.

ధ్యాన్​చంద్ ​ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా క్రీడారంగం వైపు అడుగులు వేసేలా మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. క్రీడా దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ గొడం నగేశ్, కలెక్టర్ రాజర్షి షా హాజరై ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. ఎంపీ క్రీడా మహోత్సవం లాగిన్‌ను ప్రారంభించారు. 

క్రీడా ప్రపంచానికి ధ్యాన్ చంద్ మార్గదర్శకుడు

జాతీయ క్రీడా ప్రపంచానికి ధ్యాన్​చంద్​ మార్గదర్శకుడు అని నిర్మల్ ​జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో జరిగిన సీయం కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించిన క్రీడాకారులను అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు సన్మానించారు. హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పాకాల రాంచందర్, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభగౌడ్, సాఫ్ట్‌ బాల్ అసోసియేషన్ సెక్రటరీ అన్నపూర్ణ గౌడ్, ట్రస్మా అధ్యక్షులు చంద్ర గౌడ్ పాల్గొన్నారు.