
- ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుంది
- వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి జీడీపీ ఏడాదికి 8 శాతం పెరగాలి
- గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో మార్పులు మొదలయ్యాయి
- సొంత కాళ్లపై నిలబడడం అవసరం
న్యూఢిల్లీ: ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు, హెచ్1 బీ వీసా ఫీజుల పెంపు, యుద్దాలు, జియో పొలిటికల్ టెన్షన్లు వంటివి దేశ ఆర్థిక వృద్ధిని ఆపలేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పేర్కొన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ నాల్గో ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. “గ్లోబల్‌గా నెలకొన్న ఆర్థిక సమస్యలను తట్టుకునే సామర్థ్యం మనకుంది. మన ఆర్థిక వ్యవస్థ స్థాయి క్రమంగా పెరుగుతోంది. మనం ఫ్యూచర్‌లో తీసుకునే చర్యలే ఈ పరిస్థితులు కొనసాగుతాయా లేదా అన్నది నిర్ణయిస్తాయి” అని ఆమె అన్నారు. జియోపాలిటికల్ సంక్షోభాలు పెరుగుతున్నాయని, ఆంక్షలు, సుంకాలు, డీకప్లింగ్ (ఇతరులపై ఆధారపడడాన్ని తగ్గించడం) వ్యూహాలు గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో మార్పులు తీసుకొచ్చాయని ఆమె అన్నారు.
సప్లయ్ చెయిన్‌లో భారత్ బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. “వికసిత భారత్– 2047ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనర్ధం భారత్ ఆర్థిక వ్యవస్థ క్లోజ్డ్ ఎకానమీగా మారాలన్నది కాదు. ఈ టార్గెట్‌ను చేరుకోవాలంటే ఏడాదికి 8శాతం చొప్పున జీడీపీ వృద్ధి సాధించాలి” అని నిర్మల స్పష్టం చేశారు. అమెరికా భారత్ దిగుమతులపై 50శాతం సుంకం విధించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. అమెరికా తన పార్టనర్ దేశాలపై కూడా సుంకాలు వేస్తూ క్లోజ్డ్ ఎకానమీగా మారుతున్న విషయం తెలిసిందే. “ప్రపంచ అనిశ్చితుల ప్రభావం మనపై తక్కువగా ఉంటుంది.
గ్లోబల్ సమస్యలు ఉన్నా, మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఎదుగుతుంది” అని నిర్మల అన్నారు. ప్రస్తుతం ఉన్న విభజన, అస్థిరత, అనిశ్చితులతో కొత్త మార్గాలు ఓపెన్ అవుతాయని అభిప్రాయపడ్డారు. “ కొత్త సహకారాలు క్రియేట్ అవుతాయి. ‘ఇన్‌క్లూజివ్ (అందరూ కలిసి)’ పై ఫోకస్ అవసరం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ముఖ్యం. నిర్ణయాలు ఎక్కడో తీసుకుంటే మన ఫాలో అయ్యే రోజులు పోయాయి.
సొంత కాళ్లపై నిలబడగలగాలి. ఫలితాలను ప్రభావితం చేయగలగాలి” అని నిర్మలా సీతారామన్ వివరించారు. ఇప్పటి అంతర్జాతీయ సంక్షోభాలు తాత్కాలికమైనవి కావని, ఇవి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులకు సంకేతమని ఆమె స్పష్టం చేశారు.
బోలెడు బిజినెస్ అవకాశాలు
భారత్‌లో ప్రైవేట్ పెట్టుబడులు అవకాశాలను గుర్తించడం ప్రారంభించాయని, ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) ప్రాజెక్టులపై ఆసక్తి మళ్లీ పెరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ మూలధన ఖర్చులు గణనీయంగా పెరిగాయని, ఈ ఖర్చులను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. “గత ఐదేళ్లలో ప్రతి సంవత్సరం మూలధన వ్యయం (క్యాపెక్స్) సంఖ్యలు పెరుగుతున్నాయి.
ఈ ట్రెండ్ కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. కాగా, కొవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్ధతుగా నిలిచేందుకు మోదీ ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెంచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11.21 లక్షల కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని పెట్టుకోగా, మొదటి నాలుగు నెలల్లో రూ.3.47 లక్షల కోట్లతో ఏడాది లెక్కన 33శాతం వృద్ధి నమోదైంది.