
నేచర్ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ యాణ. కర్ణాటకలో ఉన్న ఎన్నో ఇంట్రెస్టింగ్ టూరిస్ట్ ప్లేస్ల్లో ఇది ఒకటి. యాణలో అడుగుపెడితే ఒక పక్క జలపాతాలు, మరో పక్క వన్య ప్రాణులు వెల్కం చెబుతాయి. అలా నడుచుకుంటూ ప్రకృతి ఒడిలోకి జారుకోవచ్చు. అంతేనా, పనిలోపని ట్రెక్కింగ్ కూడా చేసేయొచ్చు. యాణ గుహలు, వాటి చరిత్ర, పురాణ గాథలు తెలుసుకుంటూ బుర్రకి జ్ఞానాన్ని అందించొచ్చు.
నేచురల్ బ్యూటీకి .. ఉత్తర కన్నడ జిల్లాలోని వెస్టర్న్ ఘాట్స్ (ఉత్తర కనుమలు) కేరాఫ్ అడ్రస్. సిర్సి, కుమ్తా అడవుల్లో ఉంది యాణ విలేజ్. ప్రకృతి అందాలకే కాదు పరిశుభ్రతలో కూడా ఇది బెస్ట్ ప్లేస్. కర్ణాటక మొత్తంలో అతి పరిశుభ్రమైన గ్రామం ఇది. అంతేనా, దేశం మొత్తంమీద పరిశుభ్రతలో యాణది రెండో స్థానం. ఈ ప్లేస్‌కు ఉన్న మరో ప్రత్యేకత... ప్రపంచంలోనే ఎక్కువ తేమ గలిగిన ప్రాంతం కావడం. ఇక్కడ ‘‘భైరవేశ్వర శిఖర’’, ‘‘మోహిని శిఖర’’ అని రెండు ప్రత్యేకమైన రాతి గుట్టలు ఉన్నాయి. భైరవేశ్వర శిఖర దాదాపు 390 అడుగుల ఎత్తున ఉంటుంది. మోహిని శిఖర 300 అడుగుల
ఎత్తులో ఉంటుంది. ఈ రెండూ ఊరికి దగ్గరగా ఉండటం వల్ల టూరిస్ట్ అట్రాక్షన్ అయ్యాయి. శివరాత్రి, రథయాత్ర వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
యాణ గుహలు
భైరవేశ్వర శిఖర, మోహిని శిఖర చూడ్డానికి గుట్టల్లా ఉండవు. ఎవరో చెక్కినట్టు టవర్స్‌లా ఉంటాయి. సున్నపురాయి, జిప్సం, డోలమైట్ కలగలిపిన రాతి గుట్టలివి. ఇక్కడ ఉండే గుహలు కూడా అద్భుతమే. ఈ గుహలతోపాటు చుట్టుపక్కల ఉన్నవాటిని చూసేందుకు రెండు రోజులు పడుతుంది. ఈ గుహలు సహ్యాద్రి పర్వత శ్రేణికి దగ్గర్లో ఉన్నాయి. దాదాపు మూడు మీటర్ల లోతులో ఉంటాయి. భైరవేశ్వర శిఖర కింద ఆలయగుహ ఉంది. అక్కడే స్వయంభుగా వెలసిన శివలింగం ఉంది. ఈ లింగం పైనుంచి నీళ్లు కిందకి పడుతుంటాయి. ఆ దృశ్యం చూసేందుకు భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఈ ప్రాంతం భక్తులకే కాదు, ట్రెక్కర్స్‌కు అడ్వెంచర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ట్రెక్కింగ్ చేస్తూ కొండమీది నుంచి కిందికి పారుతున్న జలపాతాల్ని చూడొచ్చు.
విభూతి జలపాతం
విభూతి జలపాతాలు కూడా యాణ రాక్స్ దగ్గర్లోనే ఉంటాయి. ఇవి దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటాయి. ఈ జలపాతం దగ్గరికి వెళ్లాలంటే వెదురు, మడ అడవుల గుండా వెళ్లాలి. ఆ చెట్ల మధ్య దారి చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి కాలి నడకనే వెళ్లాలి. వెళ్లేదారిలో అప్పుడప్పుడు జంతువులు కనిపిస్తుంటాయి కూడా. కాలినడకన పైకి ఎక్కాలనుకునే వాళ్ల కోసం మెట్ల దారి ఉంది. అలావెళ్తే కాలినడకన ఆరుగంటల కంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకని తినడానికి స్నాక్స్, మంచినీళ్ల బాటిల్స్ వెంట పట్టుకెళ్లాలి. కాలినడకన వెళ్లాలనుకునేవాళ్లకి కాస్త ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే దారిలో రకరకాల జాతుల పాముల, జంతువులు చాలా కనిపిస్తాయి. నడుస్తున్నప్పుడు జలగలు పట్టుకుంటాయి. అందుకని అటుఇటు చూసుకుంటూ నడవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలగల సంఖ్య కూడా పెరుగుతుంది. వాటినుంచి కాపాడుకునేందుకు ఉప్పు బ్యాగ్ పట్టుకెళ్లాలి. జలగ పట్టుకుంటే దాని మీద ఉప్పు చల్లితే వెంటనే వదిలేస్తుందట. అందుకని ఇక్కడికి వర్షాకాలంలో కాకుండా మిగతా సీజన్లలో వెళ్తే టూర్ ఎంజాయ్ చేయొచ్చు.
పురాణ గాథ
పురాణాల ప్రకారం ఈ ప్రదేశానికి, భస్మాసురుడికి సంబంధం ఉంది. భస్మాసురుడు ఘోర తపస్సు చేసి శివుడి నుంచి వరం పొందాడు. ఆ వరమేంటంటే... భస్మాసురుడు ఎవరి తలమీద చేయి పెడితే వాళ్లు కాలి బూడిద అయిపోవాలని. అయితే ఆ వరాన్ని పరీక్షించడానికి వరమిచ్చిన శివుడి తలమీదే భస్మాసుర హస్తం పెట్టాలనుకుంటాడు. అందుకోసం శివుడి వెంట పడతాడు. దాంతో కలవరపడిన శివుడు.. విష్ణువు సాయం కోరతాడు. శివుడికి సాయం చేసేందుకు విష్ణువు మోహిని అవతారం ఎత్తుతాడు. మోహిని అందానికి ముగ్దుడైన భస్మాసురుడు ‘నాతో నృత్యం చేయగలవా’ అని సవాల్ విసురుతాడు. ఆ పోటీలో మోహిని నృత్యం చేస్తూ చేతిని తలపై పెట్టుకునే భంగిమ పెడుతుంది. వరం విషయం మర్చిపోయిన భస్మాసురుడు తన తలపై చెయ్యి పెట్టుకుని, కాలి బూడిదైపోతాడు. అప్పుడు మంటలు వ్యాపించి యాణలోని సున్నపు రాయి, రాతి శిలలు నల్లగా మారాయని చెబుతారు. ఆ నిర్మాణాల చుట్టూ నల్ల మట్టి, బూడిద ఉంటాయి. అవే రుజువులని భక్తులు నమ్ముతారు. ఇక్కడున్న భైరవేశ్వర శిఖరాన్ని ‘శివుడి కొండ’ అని, మోహిని శిఖరాన్ని ‘మోహినీ కొండ’ అని పిలుస్తారు. ఇక్కడ పార్వతీదేవి విగ్రహం, వినాయకుడి ఆలయం కూడా ఉన్నాయి.
శివరాత్రి పండుగ
ఇక్కడ మహాశివరాత్రి పండుగను 10రోజులపాటు పండుగలా చేస్తారు. పదివేల దేవతలతో కొలువైన భైరవక్షేత్రంగా చెబుతారు దీన్ని. దగ్గరలో ఉన్న గోకర్ణ నుంచి నీటిని తెచ్చి అభిషేకం చేస్తారు. అందుకే కన్నడలో ఒక నానుడి ఫేమస్ అయింది. ‘‘సొక్కిధవను యాణక్కె హొగుతానె, రొక్కిద్ధవను గోకర్ణ కె హొగుతనె’’ అంటే పూజల కోసం గోకర్ణకు వచ్చే భక్తులు, యాణకి కూడా పూజల కోసమే వెళతారని.
సిర్సి
యాణ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో సిర్సి ఉంటుంది. ఇది కూడా కర్ణాటకలోని మరో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ టూరిస్ట్‌లను అట్రాక్ట్ చేసే సహస్రలింగ, ఉంచల్లి ఫాల్స్, శివగంగ ఫాల్స్, బెన్నె హోల్ ఫాల్స్, గువడి బర్డ్ శాంక్చురీ ఉన్నాయి. నేషనల్ నేచురల్ హెరిటేజ్ సైట్‌గా యాణని ప్రకటించారు. ఇది ఉత్తర కన్నడలో హిస్టారికల్, టూరిస్ట్ సెంటర్‌గా పేరుగాంచింది. ఈ ప్రదేశాన్ని బయోడైవర్సిటీ
హాట్‌స్పాట్ అంటారు. 2002లో బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్ యాక్ట్ కింద దీని పేరును సజెస్ట్ చేశారు.
మిర్జాన్ కోట
మిర్జాన్ కోట... గతంలో కర్ణాటకలో ఎన్నో యుద్ధాల్లో పోరాడి ఓడిన ప్రదేశంగా పేరుగాంచింది. ఇది ఉత్తర కన్నడ జిల్లాలో పశ్చిమ తీరాన ఉంది. ఈ కోట నిర్మాణం చూపు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు బావి, శిథిలాల మధ్యనున్న ప్రార్ధనామందిరాలను కూడా చూడొచ్చు.
సినిమా వల్ల ఫేమస్ అయింది
బ్రిటీష్ అధికారి ఫ్రాన్సిన్ బుచ్మన్ హామిల్టన్. ఫేమస్ జియోగ్రాఫర్, జువాలజిస్ట్, బొటానిస్ట్ కూడా. ఈ ప్రాంతాన్ని1801లో సర్వే చేశాడు. ఆయన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్రాంతం చుట్టూ పదివేలకంటే ఎక్కువమంది జనాభా ఉన్నారు. సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రజలు వేరువేరు ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అందుకని ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. వాటిలో ఒకటి పూజారి కుటుంబం. ‘‘నమ్మూర మందార హూవే” అనే పాపులర్ కన్నడ మూవీ షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ సినిమా వచ్చాక ఈ ప్లేస్ ఫేమస్ అయ్యి, ప్రతివారం టూరిస్ట్‌లతో కిటకిటలాడుతోంది.
యాణ ఇలా వెళ్లాలి
రోడ్, ట్రైన్, ఫ్లైట్ ఎలాగయినా వెళ్లొచ్చు. రోడ్ అయితే సిర్సి నుంచి 50 కి.మీ. కుమ్తా నుంచైతే 30 కి.మీ ప్రయాణం చేయాలి. బెంగళూరు నుంచి లోకల్ బస్‌లలో వెళ్లొచ్చు. ట్రైన్లో అయితే హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి కుమ్తా వెళ్లి అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్‌లో యాణ గ్రామానికి చేరొచ్చు. యాణ, మంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 262 కిలోమీటర్లు, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచైతే 463 కి.మీ. దూరం ఉంటుంది.