
- ఇయ్యాల్టి నుంచి అక్టోబర్ 2 వరకు దుర్గామాత మండపాల్లో సందడి
- వేములవాడ రాజన్న, కరీంనగర్ శ్రీమహాశక్తి ఆలయాల అలంకరణ
- రోజుకో అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనం
కరీంనగర్/వేములవాడ, వెలుగు: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. దుర్గామాత ప్రతిష్టాపనకు ఊరూరా మండపాలను రెడీ చేస్తున్నారు. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వనున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం, కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి ఆలయాల్లో నవరాత్రోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ గోపురాలకు విద్యుత్ అలంకరణ, స్వామి వారి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వేములవాడలో ఈ నెల 30న దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి వద్ద చండీ కలశ ప్రతిష్ట, చండీహవనం , మహిషాసురుమర్దిని అమ్మవారికి మహాపూజ, అక్టోబర్1న అమ్మవారి పూర్ణాహుతి, బలిహరణ రాత్రి ధర్మగుండంలో స్వామివారి తెప్పోత్సవం, విజయదశమి సందర్భంగా ఆలయంలో ఆయుధపూజ, స్వామివారి పెద్దసేవ (అంబారీ సేవ), స్వామివారి అమ్మ వార్ల శమీయాత్ర, ప్రతిరోజు రాత్రి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, పార్వతి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఉత్సవమూర్తులతో వేములవాడ పట్టణంలో పెద్దసేవ నిర్వహిస్తారు. కాగా నవరాత్రులలో ఆలయంలో శ్రీస్వామి వారి నిత్య కల్యాణాలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు.
భవానీ దీక్షాపరులతో కిక్కిరిస్తున్న మహాశక్తి ఆలయం
ఏటా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు భవానీ దీక్షను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే వేలాది మంది దీక్ష చేపట్టారు. భక్తులు 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల కోసం నవరాత్రి దీక్షను ఏటా స్వీకరిస్తూ నియమనిష్టలతో అమ్మవారిని తరిస్తారు. అమ్మవారి మాలధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చే అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
రోజుకో రూపంలో అమ్మవారి దర్శనం..
దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరిదేవి (శైలపుత్రి) అవతారం, రెండోరోజు శ్రీగాయత్రీ దేవి(బ్రహ్మచారిని), మూడో రోజు అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట), నాలుగో రోజు కాత్యాయని దేవి(కూష్మాండ ), ఐదో రోజు శ్రీమహాలక్ష్మి దేవి(స్కంద మాత), ఆరో రోజు లలితా దేవీ(కాత్యాయని), ఏడో రోజు శ్రీమహాచండీదేవి(కాళరాత్రి), 8వ రోజు సరస్వతి దేవి (మహాగౌరీ, తొమ్మిదో రోజు దుర్గా దేవి(సిద్ధి), 10వ రోజు మహిషాసురమర్ధిని, 11వరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారు.
రాయికల్, వెలుగు: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో శ్రీగిరి పర్వతంపై వెలసిన శ్రీకనకదుర్గ అమ్మవారు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్తర తెలంగాణలో అత్యంత మహిమగల ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. నిర్వహకులు ప్రతిరోజు అన్నదానంతో పాటు ఇతర వసతులు సమకూర్చారు. నేటి నుంచి 11 రోజులపాటు అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు.