పాక్ ​ప్రధానిగా నవాజ్​ తమ్ముడు!

పాక్ ​ప్రధానిగా నవాజ్​ తమ్ముడు!

ఇస్లామాబాద్ :  మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్ పాక్ ​కొత్త ప్రధాని కానున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్ ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవగా.. పీఎంఎల్‌‌-ఎన్‌‌ పార్టీ మాజీ ప్రధాని షెహబాజ్​షరీఫ్​ను మంగళవారం రాత్రి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించింది. ఈ మేరకు షెహబాజ్ షరీఫ్(72)ని దేశ ప్రధాని పదవికి పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ నామినేట్ చేశారని పీఎంఎల్-ఎన్ సమాచార కార్యదర్శి మర్రియం ఔరంగజేబు తెలిపారు. పీఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ పంజాబ్ సీఎం పదవికి నామినేట్ అయినట్లు చెప్పారు. 

133 స్థానాలకు..152 సీట్ల బలం

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన ఆసిఫ్ అలీ జర్దారీ, ముత్తాహిదా క్వామీ మూవ్‌‌మెంట్ పాకిస్తాన్(ఎంక్యూఎంపీ)కి చెందిన ఖలీద్ మక్బూల్ సిద్ధిఖీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ -క్వైద్(పీఎంఎల్​క్యూ)కు  చెందిన షుజాత్ హుస్సేన్ నివాసంలో హెహబాజ్​సమావేశమై సంప్రదింపులు జరిపారు. ఆరు పార్టీలు మద్దతు తెలుపడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం క్లియరైంది. పీఎంఎల్ఎన్ ​పార్టీ 75 సీట్లు గెల్చుకోగా పీపీపీ(54), ఎంక్యూఎంపీ(17), పీఎంఎల్​క్యూ(3), ఐపీపీ(2), బీఏపీ(1) పార్టీలతో కలిసి సంకీర్ణ కూటమి బలం 152 సీట్లుగా ఉంది.

నేరస్తుల గుంపు ఒకటైంది :  పీటీఐ

పీఎంఎల్​ఎన్​ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న వేళ ఇమ్రాన్​ ఖాన్ ​పార్టీ పాకిస్తాన్​ తెహ్రీక్ ​ఇ ఇన్సాఫ్​ (పీటీఐ) స్పందించింది. ప్రజలు ఇమ్రాన్ ఖాన్​కు ఇచ్చిన స్పష్టమైన మెజార్టీ ని రాత్రికి రాత్రి దొంగిలించారని పీటీఐ కేంద్ర కార్యదర్శి రవోఫ్ హసన్ ఆరోపిం చారు. భవిష్యత్​లో పాక్​లో మరింత అస్థిరత నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రజలు తిరస్కరించిన పార్టీలు నేరస్తులతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం పాక్ ​ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను ప్రతిబింబిస్తున్నది’ అని విమర్శించారు. దేశాన్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించే ఏకైక ఆశాకిరణం పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్​ ఖాన్ అని ఆయన పేర్కొన్నారు.