టీవీ ఇంటర్వ్యూ నుంచి ట్రంప్ వాకౌట్..ఎన్‌‌‌‌బీసీ నిర్వహిస్తున్న మీట్ ద ప్రెస్ లో ఘటన

టీవీ ఇంటర్వ్యూ నుంచి ట్రంప్ వాకౌట్..ఎన్‌‌‌‌బీసీ నిర్వహిస్తున్న మీట్ ద ప్రెస్ లో ఘటన

వాషింగ్టన్/ న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ అమెరికన్ టీవీ నెట్‌‌‌‌వర్క్ ‘ఎన్‌‌‌‌బీసీ’ నిర్వహిస్తున్న ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అందులో సీనియర్ జర్నలిస్ట్ క్రిస్టెన్ వెల్కర్‌‌‌‌కు ఇంటర్వ్యూ ఇస్తూ మధ్యలోనే తీవ్ర ఆగ్రహంతో వాకౌట్ చేశారు. 

విస్కాన్సిన్‌‌‌‌లోని ఒక ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో దాదాపు 50 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ సాగింది. వివాదాస్పద 1.8 బిలియన్‌‌‌‌ డాలర్ల “యాంటీ–వెపనైజేషన్” ఫండ్‌‌‌‌పై హోస్ట్‌‌‌‌ ప్రశ్నించారు. దాంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ హిల్​పై దాడి చేసిన నిందితులకు కూడా ప్రభుత్వ నిధుల నుంచి నష్టపరిహారం చెల్లిస్తారా? అని ఆమె నిలదీశారు. 

అందుకు ట్రంప్ సమాధానమిస్తూ.. ఆ రోజు ఎఫ్‌‌‌‌బీఐ ఏజెంట్లే నిరసనకారులను భవనం లోపలికి వెళ్లనిచ్చారని, జో బైడెన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసమే వారిని జైల్లో పెట్టిందని ఆరోపించారు. దీనిపై హోస్ట్‌‌‌‌.. ‘‘మీ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు.

 దాంతో అసహనానికి గురైన ట్రంప్.. ‘‘నేను ప్రత్యేకంగా సాక్ష్యాలు చూపనక్కర్లేదు. కళ్లెదుటే కనిపిస్తోంది” అన్నారు. ఆ తర్వాత ఎన్‌‌‌‌బీసీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌తోపాటు మరికొన్ని మీడియా సంస్థలు కూడా అవినీతిమయమయ్యాయని ఆరోపించారు.  హోస్ట్‌‌‌‌ తన ప్రశ్నలను కొనసాగించేందుకు ప్రయత్నించినప్పటికీ, ట్రంప్ ఏమాత్రం వినకుండా వెళ్లిపోయారు.