50:50 ఫార్ములాపై శివసేన పట్టు: తప్పుకాదంటూ శరద్ పవార్ మద్దతు

50:50 ఫార్ములాపై శివసేన పట్టు: తప్పుకాదంటూ శరద్ పవార్ మద్దతు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవిని చెరి సగం పంచుకునే అంశంపై బీజేపీ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఉద్దవ్ థాకరే ఇంట్లో  సమావేశమైన 56 మంది శివసేన ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు అమిత్ షా ఇచ్చిన 50-50 ఫార్మూలా అమలుకు పట్టుబట్టాలని నిర్ణయించారు. చెరో రెండున్నర ఏళ్లు అధికారం పంచుకుందామని బీజేపీని ఉద్దవ్ థాకరే కోరుతారని శివసేన ఎమ్మెల్యేలు చెప్పారు.

1990లోనూ ఇలాగే చేశారన్న పవార్

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే 50-50 ఫార్ములాకు పట్టుబడుతోంది శివసేన. ఆదిత్య థాకరేను ముఖ్యమంత్రి చేయాలని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగగానే డిమాండ్ చేశారు. ఆదిత్య థాకరే సీఎం అంటూ ముంబైలో పోస్టర్లు కూడా వెలిశాయి. ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచిన ఎన్సీపీ కూడా శివసేనకు మద్దతు ఇస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై శివసేన ప్రతిపాదిస్తున్న 50-50 ఫార్ములా  తప్పేం కాదన్నారు శరద్ పవార్. 1990లో కూడా బీజేపీ, శివసేన పార్టీలు ఇదే మోడల్ అనుసరించాయనీ ఆయన గుర్తుచేశారు.  తాము ప్రతిపక్షంలో కూర్చోవాలనే నిర్ణయించుకున్నామన్నారు ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు.

మహారాష్ట్ర పీసీసీ చీఫ్

మేం రెడీ అంటున్న కాంగ్రెస్

మరోవైపు ప్రత్యామ్నాయ పొత్తులకు సిద్ధమనే సంకేతం ఇచ్చింది కాంగ్రెస్. మహారాష్ట్ర పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్ .. బారామతిలో శరద్ పవార్ ను కలిశారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. శివసేన పార్టీ  మమ్మల్ని సంప్రదిస్తే.. తదుపరి కార్యాచరణ ఉంటుందని మహారాష్ట్ర  కాంగ్రెస్ నేత విజయ్ వడెత్తివార్ చెప్పారు.

శివసేనకు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు తెలిపారు. రామ్ టెక్ ఎమ్మెల్యే ఆశిష్ జైశ్వాల్, భాంద్రా నరేంద్ర భోండేకర్ లు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను కలిసి తమ మద్దతు ప్రకటించారు. అటు ఇండిపెండెట్ అభ్యర్థుల మద్దతు తీసుకుని.. శివసేనను తమ దారిలోకి తెచ్చుకోవాలని బీజేపీ వ్యూహరచన సాగిస్తోంది. ఈనెల 30న బీజేఎల్పీ సమావేశం ఉంటుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు.