
- రాష్ట్రంలో గతేడాది 178 మంది రైతుల ఆత్మహత్య
- డిగ్రీ, ఆపై చదివిన స్టూడెంట్స్ 497 మంది సూసైడ్
- ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో వెల్లడి
- లెక్కల్లోకి రాని కౌలు రైతుల ఆత్మహత్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గతేడాది రైతుల ఆత్మహత్యల కంటే స్టూడెంట్ల ఆత్మహత్యలే ఎక్కువగా జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో వెల్లడైంది. గతేడాది రాష్ట్రంలో 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, డిగ్రీ, ఆపై చదివిన 497 మంది స్టూడెంట్లు సూసైడ్ చేసుకున్నారని తేలింది. అయితే, తెలంగాణలో కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు ఆత్మహత్యలుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఎన్‌సీఆర్‌బీ కూడా కౌలు రైతుల సూసైడ్స్ ను నివేదికలో పేర్కొనలేదు. దీంతో రాష్ట్రంలో రైతుల కంటే స్టూడెంట్ల సూసైడ్లే మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని రంగాల్లో కలిపి 9,980 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని నివేదిక తెలిపింది. 2019 నుంచి 2022 వరకు మొత్తం 2,025 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతుల నమోదు
దేశవ్యాప్తంగా గతేడాది మొత్తం5,207 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఇందులో 789 మంది కౌలు రైతులు ఉన్నారు. తెలంగాణలో కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు ఆత్మహత్యలుగా గుర్తించలేదు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో 309 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా ఇందులో 60 మందిని కౌలురైతులుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కర్నాటకలో 338 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.
రాష్ట్రాలు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా
ఏటా దేశవ్యాప్తంగా జరిగిన నేరాలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను ఆయా రాష్ట్రాల పోలీస్ డిపార్ట్‌మెంట్స్ నుంచి ఎన్‌సీఆర్‌బీ సేకరిస్తుంటుంది. గతేడాది కూడా వివిధ కారణాలతో జరిగిన ఆత్మహత్యల వివరాలను కేటగిరీల వారిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీఆర్‌బీకి అందించింది. ఈ రిపోర్ట్ ఆధారంగా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల కంటే రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువగా నమోదయ్యాయి.