విద్యా కౌన్సెలర్ల నియామకం అవసరం

విద్యా కౌన్సెలర్ల  నియామకం అవసరం

ఇటీవల విద్యాసంస్థల్లో పెరుగుతున్న పసిపిల్లల మరణాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నది.  అంతకంతకూ పెరిగిపోతున్న విద్యార్థుల వరస మరణాలను ఉటంకిస్తూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిని వ్యవస్థాగత వైఫల్యంగా అభివర్ణించింది.  

పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు  జీవించే హక్కుకు విఘాతం అని, వాటి నివారణకై ప్రతి విద్యాసంస్థలో విద్యా కౌన్సెలర్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ప్రాథమిక, ఉన్నత విద్యా సంస్థలతోపాటుగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కూడా ఈ నిబంధనలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో విద్యా సంస్థల్లో విద్యా కౌన్సెలర్ల ఆవశ్యకత మరొకసారి వెలుగులోకి వచ్చింది.  

నిజానికి పాఠశాలల్లో కౌన్సెలర్ల నియామకానికి సంబంధించిన డిమాండ్ కొత్తది ఏం కాదు. గతంలోనూ అనేక కమిటీలు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా వారి ప్రయోజనార్థం విద్యా కౌన్సెలర్ల నియామకం అవసరమని సూచించాయి. 2001లో నీరదారెడ్డి కమిషన్ విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం తరచుగా కౌన్సెలింగ్ చేయాలని సూచించింది. 

జాతీయ విద్యా విధానం -2020 కూడా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యాసంస్థల్లో కౌన్సెలర్ల నియామకం తప్పనిసరి అని సూచించింది.  కానీ, కొన్ని రాష్టాల్లోని విద్యా సంస్థలు, జవహర్ నవోదయ వంటి జాతీయ విద్యా సంస్థలు మినహా దేశంలో చాలా రాష్ట్రాల్లో విద్యా కౌన్సెలర్ల నియామకం జరగలేదు సరికదా  ప్రభుత్వాలు దానిని ఒక అవసరంగా కూడా గుర్తించలేదు.  

కౌన్సెలింగ్​ యంత్రాంగం లేదు

నేటి సమాజంలో విద్యారంగం పోటీతత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మార్కులు,  ర్యాంకులే ధ్యేయంగా కొనసాగుతున్న బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతున్నది. మానసిక ఉల్లాసం అందించే క్రీడలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో పోటీలో ఏ మాత్రం వెనకబడినా, అనుకున్న విద్యా సంస్థలో, కోర్సుల్లో సీటు రాకపోయినా, విద్యార్థులు తీవ్రమైన ఆత్మన్యూనతాభావానికి లోనవుతున్నారు.  తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో హోమ్ సిక్​తో రెసిడెన్షియల్ విద్యార్థులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. కుటుంబాల్లో పెరుగుతున్న కలహాల వల్లనో, చిన్న వయస్సులో వచ్చే ఆకర్షణతో ప్రేమ విఫలం అయిందనే భావనతోనో విద్యార్థులు మానసికంగా బలహీనంగా మారుతున్నారు. 

ఒత్తిడిని అధిగమించడానికి కొందరు మత్తు పదార్థాలకు బానిసలవుతుంటే, ఒత్తిడిని జయించలేక మరికొందరు ప్రాణాలే తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకొని, వారికి మానసిక, నైతిక మద్దతును ఇవ్వగలిగే యంత్రాంగం అవసరం.  కానీ, అలాంటి యంత్రాంగం విద్యా సంస్థల్లో కనబడడం లేదు. 

భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి

ప్రతి విద్యార్థి మానసిక స్థితిగతుల పట్ల అవగాహన పెంపొందించగలిగి, భావోద్వేగాలను అదుపులో ఉంచేలా కృషి చేస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఒక వారధిగా ఉండే కౌన్సెలర్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిరంతర పర్యవేక్షణ ద్వారా, విద్యార్థుల్లో మానసిక సంఘర్షణను త్వరితగతిన గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం పెరగడంతో పాటుగా, ఆత్మహత్యలను నివారించగలుగుతాం. ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు తన నిర్ణయంలో వెలువరించింది కూడా. 

సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యా సంస్థల్లో  కౌన్సెలర్లను నియమించాలి అంటే ఎవరిని ఎంపిక చేయాలి అనేది మరొక ప్రశ్న. గతంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో జరిపిన నియామకాల్లో కేవలం సైకాలజీ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే  ప్రాధాన్యత కల్పించారు.  అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. 

విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక సంఘర్షణ అనేక సామాజిక సమస్యలతో ముడిపడి ఉంది.  బయో సోషల్ థియరీ ఆఫ్ క్రైమ్ ప్రకారం జీవ సంబంధ అంశాలతో పాటుగా సామాజిక అంశాలు కూడా ఆత్మహత్యలకు కారణం అవుతాయి. విద్యా సంబంధ ఒత్తిడితోపాటుగా, ఆర్థిక సంబంధ అంశాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాల్లో సామాజిక అవగాహన అవసరం.  కౌన్సెలర్లుగా, సామాజిక కార్యకర్తలుగా, పారా లీగల్ అడ్వైజర్లుగా, సోషల్ వర్కర్లు విభిన్న పాత్రలను పోషించగలుగుతారు.

స్వచ్ఛంద సంస్థల సేవలూ వినియోగించుకోవాలి

కరోనా సమయంలో ఆన్‌‌లైన్ విద్య అందుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యా బోధనకు ఆటంకం ఏర్పడింది. ఆన్‌‌లైన్ విద్య కోసం అవసరమయ్యే పరికరాలను కొనుక్కోలేక కొందరు నిరుపేద విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డ ఉదంతాలు చూశాం. 

ప్రభుత్వాలు వనరులను అందించలేనప్పుడు స్థానికులను, స్వచ్ఛంద సంస్థలను పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థల స్థితిగతులను మార్చగలిగే అవకాశం ఉంటుంది. ఇందులో  సోషల్ వర్కర్లు కీలక భూమిక పోషించగలుగుతారు.  ‘నేటి బాలలే రేపటి పౌరులు’. అటువంటి బాలలను జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే రేపటి అందమైన భారతాన్ని నిర్మించగలుగుతాం. 

విద్యార్థులలో అభ్యసన సామర్థ్యం పెరగాలంటే, ఆత్మహత్య ఆలోచనలు తగ్గాలి అంటే వారిలో మానసిక సంఘర్షణలను దూరం చేయాలి. అందుకు విద్యార్థులను నిరంతరంగా పర్యవేక్షించగలిగే విద్యా కౌన్సెలర్ల నియామకం ఒక్కటే మార్గం.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికైనా కౌన్సెలర్ల నియామకంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చర్యలు చేపట్టాలి. 

- డా. అనిల్ మేర్జ -