
టోక్యో: వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూనే ప్రతిష్టాత్మక వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గోల్డ్ మెడల్ టార్గెట్‌గా వచ్చిన చోప్రా తన కెరీర్‌లోనే ఓ పీడకల లాంటి ఆటతో తీవ్రంగా నిరాశపరిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో కేవలం 84.03 మీటర్ల త్రోతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన మరో ఇండియన్ సచిన్ యాదవ్ ఆకట్టుకున్నాడు. తన పర్సనల్ బెస్ట్ 86.27 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
కొద్దిలో కాంస్యం పతకం కోల్పోయినా.. ప్రశంసలు దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌లో చారిత్రక స్వర్ణం సాధించిన ఇదే టోక్యో గడ్డపై తీవ్రంగా నిరాశ పరిచిన నీరజ్ కనీసం ఫైనల్ రౌండ్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఈ పోటీలో ఏ ఒక్క త్రోయర్ కూడా 90 మీటర్ల మార్కును దాటలేకపోయారు. నిలకడకు మారు పేరైన ఐదో త్రో తర్వాత పోటీ నుంచి నిష్క్రమించాడు. ఫస్ట్ అటెంప్ట్‌లో 83.65 మీటర్లు విసిరిన చోప్రా రెండో ప్రయత్నంలో దాన్ని 84.03 మీటర్లకు మెరుగుపరుచుకున్నా, ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు.
మూడో త్రో ఫౌల్ కాగా, నాలుగోసారి 82.86 మీటర్లు మాత్రమే విసిరాడు. పతక రేసులో నిలవాలంటే ఐదో ప్రయత్నంలో 85.54 మీటర్ల కంటే ఎక్కువ విసరాల్సిన దశలో, నీరజ్ ఒత్తిడికి గురయ్యాడు. జావెలిన్‌ను విసిరిన తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి లైన్ దాటడంతో అది ఫౌల్‌గా నమోదవడంతో నీరజ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మరోవైపు సచిన్ యాదవ్ తన తొలి ప్రయత్నంలోనే ఏకంగా 86.27 మీటర్ల దూరం విసిరాడు.
ఈ అద్భుతమైన త్రోతో అతను నీరజ్ చోప్రా, జర్మనీ స్టార్ జూలియన్ వెబర్ (86.11 మీ), పాకిస్తాన్ ఒలింపిక్ చాంపియన్ అర్షద్ నదీమ్ (82.75 మీ) వంటి మేటి అథ్లెట్లను కూడా అధిగమించాడు. ఆఖరి రౌండ్ వరకు పోటీలో నిలిచి, తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఈవెంట్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేశోర్న్ వాల్కాట్ 88.16 మీటర్లతో స్వర్ణం నెగ్గాడు. గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ (87.38 మీ) రజతం, అమెరికా త్రోయర్ కర్టిస్ థాంప్సన్ (86.67 మీ) కాంస్యం
గెలుచుకున్నారు.