ఆర్థిక సంస్కరణల ఎఫెక్ట్​

ఆర్థిక సంస్కరణల ఎఫెక్ట్​

రెండు తరాల ముందు వారి జీవిత లక్ష్యం భారతదేశాన్ని స్వాతంత్ర్య దేశంగా చూడటం. కాని ప్రస్తుత తరం ఆశయం భారత్​ను ప్రపంచంలో అగ్రదేశంగా చూడటం అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక సంస్కరణలు భారత్​ను ఆ విధంగా ముందుకు నడిపించడమే కారణం. ప్రపంచంలో మేటి ఆర్ధిక గణాంక సర్వే, , ఆర్థిక సంస్థలైన మూడీస్​, ఐఎంఎఫ్​, ప్రపంచ బ్యాంక్​, యూఈసీడీ, అమెరికా నిఘా సంస్థ ఎఫ్​బీఐ ఆ దేశ అధ్యక్షునికి సమర్పించే గుప్త నివేదిక ప్రపంచంలో భారత్​ అగ్రరాజ్య హోదాను ముక్తసరిగా ధ్రువపరుస్తున్నాయి. వీటి ప్రకారం భారత్​ 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 2045 నాటికి అమెరికాను వెనక్కినెట్టి రెండో పెద్దదిగా, 2085 నాటికి చైనాను తలదన్ని అగ్రరాజ్యంగా ప్రపంచ యవనికపై ఉదయిస్తుందని వక్కాణిస్తున్నాయి. 

స్థూలమైన ఈ వృద్ధి అభివృద్ధి పరంగా అంటే సామాజిక వృద్ధి, సామాజిక న్యాయాన్ని తీసుకురావడంలో పూర్తిగా కాకపోయినా  నిర్దేశించుకున్న లేదా అంచనాలకు తగిన మార్పు తీసుకురావడంలో సంస్కరణలు విఫలమయ్యాయి. వ్యవసాయరంగం కుదేలు, రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలు, వైషమ్యాలు, సామాజిక అలజడులు పరాకాష్టకు చేరుకున్నాయి. అంటే ప్రస్తుత సమ్మిళిత ఆర్థిక సంస్కరణలు సమ్మిళిత అభివృద్ధికి కూడా బాటలు పరచగలదనే ఏకాభిప్రాయం అన్ని వర్గాల్లో ఉండటం విస్మయం పరిచేదే. అయినా అది నిజం. కాబట్టి ప్రస్తుత సంస్కరణలను ఇంకా ముందుకు తీసుకుపోవడం అనివార్యం. కాని అత్యంత జాగరూపకతతో సమ్మిళిత, సుస్థిర అభవృద్ధి లాంటి ఉత్కృష్ట లక్ష్యాలకనుగుణంగా ఉండాలి. 

ఆర్థిక సంస్కరణలు అంటే సత్వర వృద్ధి, అభివృద్దులే లక్ష్యాలుగా పలు ఆర్థిక రంగాల్లో చేపట్టే ఆర్థిక విధానాలు. ఇవి మొదట్లో వృద్ధి, విదేశీ మారకం, ద్రవ్యోల్బణం, ఎగుమతులు– దిగుమతులు, పెట్టుబడులు లాంటి స్థూల ఆర్థిక వ్యవస్థకు చెందినవిగా ఉన్న తర్వాత సంస్కరణల క్రమంలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ అంశాలైన బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్, కార్మిక చట్టాలు, పరిపాలన, ఉద్యోగుల పెన్షన్స్​ లాంటి విషయాల ప్రక్షాళనకు సంబంధించి ఉంటాయి. ఈ సంస్కరణలనే సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్​  అంటారు. వీటి లక్ష్యం పెట్టుబడులు, సాంకేతికత, ఎగుమతులు, దిగుమతులపై పరిమితులు, నియంత్రణలను తొలగించి, ప్రభుత్వ రంగం స్థానంలో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయడం. చారిత్రకంగా సమీక్షిస్తే స్వాతంత్ర్యానంతరం భారత్​ ఒకప్పటి యూఎస్​ఎస్​ఆర్​ స్ఫూర్తితో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని 1980 దశకం వరకు అవలంబించింది. 1980 నాటికి ఈ ప్రణాళికల్లో లోపాల వల్ల ఆర్థిక స్తబ్దతకు దారి తీశాయి. దీంతో రాజీవ్​గాంధీ ప్రభుత్వం 1980 దశకంలో ప్రపంచ సరళీకరణ ప్రభావంతో కొన్ని సంస్కరణలు అంటే పెట్టుబడులపై నియంత్రణ తొలగింపు, టారిఫ్​ల తగ్గింపు లాంటి సంస్కరణలు మొదలు పెట్టినా 1990 నాటికి ఆర్థిక స్తబ్దత పెను ఆర్థిక సంక్షోభంగా రూపాంతరం పొందింది. దీనికి ప్రధాన కారణాలు దేశ అంతర్గత సమస్యలైన ప్రభుత్వరంగ సంస్థల గుదిబండ, రాజకీయ సంకీర్ణ అనిశ్చితి, దశాబ్దాలు ఆర్థిక దుష్ఫలితాలు మొదలైనవి, ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన యూఎస్​ఎస్​ఆర్​ పతనం, మొదటి గల్ఫ్​ యుద్ధం, పెట్రో ధరల పెంపు లాంటివి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా భారత్​ను మార్చాయి. తత్పలితంగా కేవలం రెండు వారాలకు సరిపడేలా విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరుకుని చెల్లింపుల సమతౌల్యం సంభవించింది. దీంతో సుమారు 67 టన్నుల బంగారం కుదువపెట్టి వివిధ ఆంక్షలతో ఐఎంఎఫ్​ నుంచి 82.2 బిలియన్లను సహాయంగా పొందింది. 

ఆర్థిక సమస్యలకు ఏకైక పరిష్కారంగా భారత 1991, జులై 24న ప్రస్తుత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికింది. ఇంకా పెట్టుబడుల స్వీకరణ, సాంకేతిక బదిలీల్లో పెద్ద దేశంగా అవతరించింది. 1991 బడ్జెట్​తో పోలిస్తే బడ్జెట్​ పరిమాణం 2022 నాటికి 21 రెట్లు పెరిగింది. తలసరి ఆదాయం ఆరు రెట్లు పెరిగింది. ఇది 1991 నాటి జనాభా 84.6 కోట్ల నుంచి 2021 నాటికి 132 కోట్లకు పెరగడం గమనార్హం. ఇంకా పేదరికం, నిరుద్యోగం చారిత్రాత్మకంగా దిగువకు చేరుకున్నాయి. 
ముగింపు: 1991లో మొదలై మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఆర్థిక సరళీకరణ సంస్కరణలు ఆర్థిక ప్రగతికి తద్వారా సామాజిక వృద్ధికి దారితీశాయి. సామాజిక న్యాయం, సమ్మళిత వృద్ధి అంచనాలకు అనుగుణంగా లేకపోయినా ఆర్థిక సంస్కరణలే దానికి ఏకైక పరిష్కారంగా ఉందనే ఏకాభిప్రాయం ఇక్కడ గమనించడం అవసరం.

1950–80ల మధ్య 3.5శాతం స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి హీనంగా హిందూ వృద్ధిగా పిలిచే స్థాయి నుంచి మూడు దశాబ్దాల సంస్కరణల కాలంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్​ రూపాంతరం చెందింది. నెహ్రూ మాటల్లో వీధిలో నిరంతర పోరాటంగా మొదలైన భారత్​ ప్రయాణం 1991 తర్వాత సంస్కరణల కాలంలో పెనుమార్పులకు, ఉన్నత లక్ష్యాలుగా పరివర్తనం చెందాయి అని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితమే భారత్​ను రెండు శతాబ్దాలకు పైగా ఏలిన యూకేను భారత్​ అధిగమించి ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం పై అంచనాలను ధ్రుఢపరుస్తుందనడంలో సందేహం లేదు. 

ఎం. గంగాధర్​ రావు, పరివర్తన్​ ఇండియా ఐఏఎస్