ఆయుర్వేద విద్యకు ‘అనంత’ సమస్యలు

ఆయుర్వేద విద్యకు ‘అనంత’ సమస్యలు

భర్తీకి నోచుకోని టీచింగ్ స్టాఫ్ పోస్టులు

టైమ్ కు అందని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు

పెచ్చులూడుతున్న భవనం.. అధ్వానంగా టాయిలెట్లు

హనుమకొండ, వెలుగు : ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయుర్వేద స్టూటెండ్లకు శాపంగా మారింది. రాష్ట్రంలో ఉన్నవి రెండే ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలైనా.. సర్కారు సౌలతులు కల్పించకపోవడంతో ఇవి కూడా మరుగున పడిపోతున్నాయి. అందులో ఒకటైన వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీలో సరిపడా ఫ్యాకల్టీ, కనీస సౌకర్యాలు లేక ఈ ఏడాది ఏకంగా అడ్మిషన్లే క్యాన్సిల్ చేశారు. కాంట్రాక్ట్​ లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో డ్యూటీలకు రావడం లేదు. దీంతో ఆయుర్వేద విద్యార్థులకు పాఠాలు చెప్పేవాళ్లే కరువయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల కింద కాలేజీ ఏర్పడగా.. స్వరాష్ట్రంలోనూ ఈ కాలేజీని పట్టించుకోవడం లేదు. 

ఇదీ సంగతి..
అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కాలేజీ 1956 లో ఏర్పడింది. ప్రస్తుతం కాలేజీ మొత్తం మీద దాదాపు 250 మంది స్టూడెంట్స్​ఉండగా.. అందులో 80 శాతం అమ్మాయిలే ఉంటారు. కాలేజీలో తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. టాయిలెట్లు అధ్వానంగా మారాయి. దాదాపు 200 మంది అమ్మాయిలకు ఒకే బాత్ రూం ఉండగా.. అది కూడా నిర్వహణ లేక కంపు కొడుతోంది. కాలేజీలో ఇంకా 1956 నాటి పుస్తకాలే ఉన్నాయి. గతంలో స్టూడెంట్లు ఆందోళన చేస్తే.. సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ తర్వాత కన్నెత్తి చూడలేదు.

ప్రిన్సిపల్ సహా.. పోస్టులన్నీ ఖాళీ
కాలేజీలో ఉన్న 14 డిపార్ట్​మెంట్లలో ఎనిమిదింటిలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఖాళీగా ఉండడంతో ఓ ఆఫీసర్ ను ఇన్​చార్జి ప్రిన్సిపల్ గా నియమించారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 28 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 23 పోస్టులకు గతంలో 15 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయగా.. ప్రభుత్వం నుంచి వేతనాలు సకాలంలో విడుదల కాక అందులో దాదాపు సగం మంది వెళ్లిపోయారు. ఇక నాన్​ టీచింగ్ స్టాఫ్​ 23 మంది ఉండాల్సినప్పటికీ ల్యాబ్​ టెక్నీషియన్లు, ఆఫీస్ సబార్డినేట్స్​, లైబ్రేరియన్స్​ ఇలా మిగతా పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.

శిథిల భవనం.. పందులు, పాముల సంచారం
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కాలేజీ బిల్డింగ్​ను 1956 లో కట్టారు. దాదాపు 65 ఏండ్లు దాటడంతో  ఇప్పుడా బిల్డింగ్​ శిథిలావస్థకు చేరింది. క్లాస్​ రూమ్స్​ లో తరచూ పెచ్చులూడిపడుతుండటంతో స్టూడెంట్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేగాకుండా నిరుడు ఇక్కడ డిజిటల్​క్లాస్​ల పేరున ఒకట్రెండు రూములలో ప్రొజెక్టర్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయగా.. మెయింటెనెన్స్​ లేక ఇప్పుడవీ మూలకుపడ్డాయి. ఇన్​చార్జి ప్రిన్సిపల్ వ్యవస్థ నడుస్తుండడం, కాలేజీని సరిగ్గా పట్టించుకునేవాళ్లు లేక ఆ పరిసరాలన్నీ తేళ్లు, పాముల వంటి విష పురుగులకు నిలయంగా మారాయి.  అంతేగాకుండా కాలేజీ ఆవరణలోనే పందులు కూడా తిరుగుతున్నాయి. దీంతో స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఫ్యాకల్టీ లేక అడ్మిషన్లు క్యాన్సిల్..
బీఏఎంఎస్ అడ్మిషన్ల నేపథ్యంలో కొద్దిరోజుల కింద ఎన్సీఐఎస్ ఎం(నేషనల్ కమిషన్​ ఫర్​ ఇండియన్​ సిస్టమ్​ ఆఫ్​ మెడిసిన్) సభ్యులు ఈ కాలేజీని వర్చువల్ గా పరిశీలించారు. లోపాలు గుర్తించి, వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. కానీ ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపులేని తనం కారణంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. దీంతో 2022-23 అకడమిక్ ఇయర్​కు సంబంధించి అడ్మిషన్లు నిలిపివేస్తూ ఎన్​సీఐఎస్​ఎం ఆర్డర్​ ఇచ్చింది. దీంతో 63 మంది స్టూడెంట్ల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.