చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లపై సర్కారు నిర్లక్ష్యం

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లపై సర్కారు నిర్లక్ష్యం
  • ఇప్పటికే ప్రాజెక్టుపై 325 కోట్లకు పైగా ఖర్చు
  • పంపింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ కాకముందే ఖరాబైతున్న మోటార్లు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి తీర ప్రాంత రైతులు సాగునీటి కోసం అనేక పోరాటాలు చేశారు. తలాపున గోదారి పారుతున్నా చుక్కనీరు ఉపయోగించుకోలేకపోతున్నామంటూ ధర్నాలు.. రాస్తారోకోలు చేశారు. దీంతో 2008లో అప్పటి సీఎం వైఎస్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు రూపకల్పన చేసింది. రెండు పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లు నిర్మించి 4.5 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్‌‌‌‌ చేసి 5 మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించింది. భూగర్భ పైప్‌‌‌‌లైన్‌‌‌‌, గ్రావిటీ కెనాల్స్‌‌‌‌ ద్వారా 62 గ్రామాల్లోని చెరువులను నింపి సాగు నీరందిస్తామని ప్రకటించారు. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు అతి ప్రధానమైన కన్నెపల్లి పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌కు 3 కి.మీ. దిగువన గోదావరి నదిపై బీరసాగర్‌‌‌‌ వద్ద పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ నిర్మించారు.  రూ. 571 కోట్లకు టెక్నికల్‌‌‌‌ శాంక్షన్‌‌‌‌ ఇవ్వగా రూ.499.23 కోట్లకు టెండర్లు ఓకే చేశారు. ఐవీఆర్సీఎల్‒ కేబీఎల్‒ మేయిల్(మేఘా) కంపెనీలు జాయింట్‌‌‌‌ వెంచర్‌‌‌‌లో పనులు దక్కించుకున్నాయి. మేఘా కంపెనీ పనులు చేపట్టింది. 

సివిల్‌‌‌‌ వర్క్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌.. కాల్వలు పెండింగ్‌‌‌‌
రూ.499 కోట్ల ప్రాజెక్ట్‌‌‌‌లో తమకు ఉపయోగపడే సివిల్‌‌‌‌ వర్క్‌‌‌‌ను మాత్రమే కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థ కంప్లీట్‌‌‌‌ చేసింది. బీరసాగర్, కాటారంలో రెండు చోట్ల పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లు నిర్మించి 8.5 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఏడు  మోటార్లను బిగించారు.  స్టేజీ ‒1లో 44.04 కి.మీ. పైప్‌‌‌‌లైన్‌‌‌‌ నిర్మాణానికి 43.85 కి.మీ దూరం, స్టేజీ‒2లో 22.67 కి.మీ.గానూ 16.42 కి.మీ. దూరం పైప్‌‌‌‌ లైన్‌‌‌‌ వేశారు. బీర సాగర్‌‌‌‌ వద్ద 132/11 కేవీ విద్యుత్‌‌‌‌ సబ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ కూడా కట్టారు. గోదావరి నది నుంచి పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లోకి నీరు రావడానికి అప్రోచ్‌‌‌‌ కెనాల్‌‌‌‌ తవ్వి ఫోర్‌‌‌‌ బే నిర్మించారు. చిన్న చితకా పనులు మినహా ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్‌‌‌‌ వర్క్‌‌‌‌లు కంప్లీట్‌‌‌‌ చేశారు. మోటార్లు బిగించారు తప్ప పంట పొలాలకు నీళ్లందించే కాలువల నిర్మాణ పనులు మాత్రం మొదలు పెట్టకపోవడంతో ప్రాజెక్ట్‌‌‌‌ పడకేసింది. ఇప్పటివరకు ప్రాజెక్ట్‌‌‌‌పై రూ.325 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 

గోదావరి వరదలకు మునిగిన పంప్‌‌‌‌హౌజ్‌‌
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం‌‌లో గోదావరి నదిపై నిర్మించిన కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ల మాదిరిగానే, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ బీరసాగర్‌‌‌‌ పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ కూడా జులై 14న వచ్చిన వరదలకు నీట మునిగింది. ఈ మూడు పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లను నిర్మించింది మేఘా కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థనే. పనులు జరిగి.. బిల్లులు చెల్లించింది ఈ ప్రభుత్వ హయాంలోనే. కన్నెపల్లి, అన్నారం పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌లలో నీట మునిగిన మోటార్లను బాగు చేయడానికి ప్రభుత్వ ఇంజినీర్లు బాగా శ్రమిస్తున్నారు. డీ వాటరింగ్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ చేసి మోటార్లకు రిపేర్లు చేస్తున్నారు. కానీ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా నిర్మించిన బీర సాగర్‌‌‌‌ పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ ను మాత్రం 90 రోజులు దాటుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాజెక్టును పట్టించుకోరా!
పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ ప్రాంత రైతులు భూములిచ్చారు. ఇక్కడి రైతుల కోసం కట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రాజెక్ట్‌‌‌‌ పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ నీట మునిగి మోటార్లు పాడవుతున్నా ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‒ గుడాల అరుణ, మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌ జడ్పీటీసీ

14 ఏండ్లయినా పనులు చేస్తలేరు
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభమై 14 ఏళ్లు అవుతోంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడేలా ప్రాజెక్టు పనులు చేపడితే కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కుతోంది. మహాముత్తారం మండలంలో పనుల జాడ కనిపించడం లేదు. పొల్లారం పెద్ద చెరువు వరకు పైపులైన్లు వేసి చేతులు దులుపుకున్నారు. - రత్నం సుభద్ర, మహాముత్తారం ఎంపీపీ