రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

రైతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించం : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
  •     ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి,  వెలుగు: రైతుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని బోధన్​ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండ పరిషత్ కార్యాలయంలో పలు శాఖల అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలోని రైతులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా సేవలందించాలన్నారు. సమస్యలపై నిర్లక్ష్యం చేసినా, రైతుల ఫిర్యాదులకు స్పందించకపోయినా సహంచేది లేదని హెచ్చరించారు. విద్యుత్​సమస్యలు లేకుండా చూడాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా వ్యవసాయశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ లు పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ ​బిల్లులు రావడంలేదని, సకాలంలో వచ్చేలా చూడాలని కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కొందరికి ఇచ్చిన ఇంటి స్థలాలను కొంత మంది ఆక్రమించుకున్నారని, వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలని కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​దత్తాద్రిని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్, వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్, నేతలు, రైతులు పాల్గొన్నారు.