ఆసియా గేమ్స్ లో భారత్ దూకుడు.. సెయిలింగ్ లో సిల్వర్ మెడల్

ఆసియా గేమ్స్ లో భారత్ దూకుడు.. సెయిలింగ్ లో సిల్వర్ మెడల్

ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. మహిళల ILCA4 ఈవెంట్‌లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇది సెయిలింగ్‌లో భారత్ కి మొదటి పతకం కాగా..దీంతో భారత్ పతకాల సంఖ్య 12 కి చేరుకుంది. థాయిలాండ్ కి చెందిన నొపాసోర్న్ కి గోల్డ్ మెడల్ దక్కింది.
 
భోపాల్ లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్ నుండి వచ్చిన నేహా మధ్యప్రదేశ్ లో దేవాస్ జిల్లా అమల్ తాజ్ గ్రామానికి చెందినది. 17 సంవత్సరాల వయసున్న నేహా ఠాకూర్ నెట్ స్కోర్ 27. నేహా కంటే కేవలం ఒక్క పాయింట్ తక్కువ నెట్ స్కోరుతో సింగపూర్ క్రీడాకారిణి కైరా మేరీ కార్లైల్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

కాగా.. పతకాల పట్టికలో భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఆరు కాంస్యాలతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా, చైనా 40 స్వర్ణాలతో 70 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.