- జంతువులు చలిని తట్టుకునేలా.. జూపార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
- యానిమల్ హౌజుల్లో హీటర్ల నుంచి గ్రీన్ నెట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని వన్యప్రాణులను చలి నుంచి కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా చలికాలం ప్రారంభం కాగానే జంతువులు, పక్షులు, సరీసృపాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చలి తీవ్రతకు అవి ఇబ్బంది పడకుండా వాటి నైట్ హౌస్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం జూ పార్క్ క్యూరేటర్ జె. వసంత ఈ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పక్షుల నుంచి పెద్ద పులుల వరకు..
పక్షుల నుంచి పెద్ద పులుల వరకు అన్ని జీవాల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సింహాలు, పులులు, చిరుతలు, కోతులు, ఎలుగుబంట్లు ఉండే నైట్ హౌస్ లలో వెచ్చదనం కోసం హీటర్లను అమర్చారు. చలిగాలులు సోకకుండా ప్రైమేట్ ఎన్ క్లోజర్లను గ్రీన్ షేడ్ నెట్లతో, మాంసాహార జంతువుల నైట్ హౌస్ లను గోనె సంచులతో కప్పి ఉంచారు. పక్షుల గూళ్లను 75 శాతం వరకు కవర్ చేయడంతో పాటు, చిలుకల కోసం ప్రత్యేక ఇన్సులేషన్ మెటీరియల్ తో కూడిన గూడు పెట్టెలను ఏర్పాటు చేశారు. రెప్టైల్ హౌస్ లో ఎండుటాకులు పరిచి, వంద వాట్ల బల్బులను అమర్చారు. దోమల బెడద లేకుండా ఏనుగులు, జిరాఫీల షెడ్ల వద్ద రెగ్యులర్ గా వేపాకులతో పొగ పెడుతున్నారు. నాక్టర్నల్ యానిమల్ హౌస్‌లో ఏసీలను పూర్తిగా నిలిపివేశారు.
నీళ్లు, ఆహారంలో బీ కాంప్లెక్స్, కాల్షియం సప్లిమెంట్లు..
జంతువుల శారీరక సంరక్షణతో పాటు వాటి ఆహారం విషయంలోనూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్ని శాకాహార, మాంసాహార జంతువులకు అందించే ఆహారం, నీటిలో బీ-కాంప్లెక్స్, కాల్షియం సప్లిమెంట్లను కలిపి అందిస్తున్నారు. మాంసాహార జంతువుల పాదాలకు తిమ్మిర్లు రాకుండా చెక్క పలకలను అమర్చగా, జీబ్రాలు గాయపడకుండా వాటి నైట్ హౌస్‌లలో మెత్తటి ఇన్సులేటెడ్ మెటీరియల్‌ను ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ జంతువులను శీతాకాలం నుంచి కాపాడి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికేనని క్యూరేటర్ వసంత తెలిపారు.
