నేత‌న్న‌ల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ సాయం.. రూ.2 వేల చొప్పున అకౌంట్‌లో డిపాజిట్

నేత‌న్న‌ల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ సాయం.. రూ.2 వేల చొప్పున అకౌంట్‌లో డిపాజిట్

క‌రోనా క‌ష్ట కాలంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నేత‌న్న‌ల‌కు ఆర్థికంగా చిరు ఆస‌రా క‌ల్పించింది. నేక‌ర్ స‌మ్మాన్ యోజ‌న పేరుతో రూ.2 వేల చొప్పున సాయం అందించే ప‌థ‌కాన్ని సోమ‌వారం క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరు పేద చేనేత‌ కార్మికుల‌కు నేరుగా బ్యాంకు అకౌంట్ల‌లో ఆ సొమ్మును జ‌మ చేశారు. క‌ర్ణాట‌క‌లో మొత్తం 54,789 మంది రిజిస్ట‌ర్డ్ చేనేత కార్మికులు ఉన్నారు. వారిలో 40,634 మంది నేక‌ర్్ స‌మ్మాన్ యోజ‌న ద్వారా ల‌బ్ధి పొందేందుకు సేవ సింధు సాఫ్ట్ వేర్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని సీఎం య‌డ్యూర‌ప్ప ఈ సంద‌ర్భంగా చెప్పారు. అందులో 37,314 మంది నేత‌న్న‌ల అప్లికేష‌న్లు ఈ ప‌థ‌కానికి అర్హ‌త ఉన్నట్లు ఆమోదం పొందాయ‌న్నారు. ఈ రోజు తొలి ద‌శ‌లో భాగంగా 19,744 మంది లబ్ధిదారుల‌కు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రూ.2 వేల చొప్పున డిపాజిట్ చేశామ‌న్నారు. త్వ‌ర‌లోనే మిగిలిన అర్హుల‌కు కూడా సాయం అందిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అలాగే రాష్ట్రంలోని అనేక ప‌వ‌ర్‌లూమ్ యూనిట్ల‌లో 1.25 ల‌క్ష‌ల మంది రోజువారీ కూలీలుగా పని చేస్తున్నార‌ని, వారందరికీ కూడా ఈ 2 వేల రూపాయ‌ల సాయం అందిస్తామ‌ని చెప్పారు. నేత కార్మికుల‌కు ఈ సాయాన్ని ఏటా కొన‌సాగిస్తామ‌ని య‌డ్యూర‌ప్ప తెలిపారు.