దేశ మంత్రిని రోడ్లపై పరిగెత్తించి..పరిగెత్తించి చితక్కొట్టారు

దేశ మంత్రిని రోడ్లపై పరిగెత్తించి..పరిగెత్తించి చితక్కొట్టారు

అతను దేశానికి మంత్రి..అందులోనూ ఆర్థిక శాఖ చూస్తున్న కేంద్ర మంత్రి. ప్రధాని తర్వాత ప్రధాని అంతస్థాయి..అలాంటి మంత్రిని రోడ్లపై పరిగెత్తించి.. పరిగెత్తించి.. వెంటాడి వేటాడి మరీ చితక్కొట్టారు జనం. నేపాల్ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనటానికి ఇంత కంటే సాక్ష్యం.. నిదర్శనం కావాలా..

సోషల్ మీడియాపై బ్యాన్ విధించటంతో.. అప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న దేశంలోని యువత.. ఒక్కసారిగా రెచ్చిపోయారు. వీధుల్లోకి దిగి తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం బ్యాన్ ఎత్తివేసినా.. సోషల్ మీడియా అకౌంట్లు యాక్టివేట్ చేసినా.. యాక్టివిస్టులు మాత్రం వెనక్కి తగ్గలేదు. కనిపించినోళ్లను కనిపించినట్లు ఎక్కడ పడితే అక్కడ.. ఎక్కడ దొరికితే అక్కడ చావబాదారు కుర్రోళ్లు. 

దేశంలో అవినీతి పెరిగిపోయిందని.. యువతకు ఉద్యోగాలు లేవంటూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి విధ్వంసానికి దిగారు.

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మంగళవారం(సెప్టెంబర్ 9) తీవ్రమైంది. దేశాన్ని కుదిపేసిన భారీ జనరల్-జెడ్ నిరసనలతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఖాట్మండు ,అనేక ఇతర నగరాలతో సహా దేశవ్యాప్తంగా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. విధ్వంసం,వీధుల్లో ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగాయి.

 హింసకు సంబంధించిన అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్‌ను వెంబడించి..అతనిని తన్నడం,పంచ్‌లతో కొడుతున్నట్లు కనిపించే వీడియో కూడా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 

పౌడెల్ తన ప్రాణాల కోసం పరిగెడుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఓ వ్యక్తి పౌడెల్‌ను తన్నడం,పౌడెల్ నేలపై పడిపోవడం, ఆ తర్వాత ఆ గుంపు అతన్ని పట్టుకుని వీధి మధ్యలో కొడుతూ తీసుకెళ్లడం కనిపిస్తోంది. 

మరో వీడియోలో పాడెల్‌ను నిరసనకారులు పరుగెత్తించి, పరుగెత్తించి పట్టుకుని అతనిపై దాడి చేసి వీధుల్లోకి ఈడ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది. మంత్రిని బట్టలూడదీసి లోదుస్తులతో మాత్రమే వీధిలో ఈడ్చుకెళ్లినట్లు చూపిస్తుంది. 

మరోవైపు పీఎం ఓలి దేశం విడిచి పారిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన హెలికాప్టర్‌లో దేశం విడిచి పారిపోయారని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.