
ఖాట్మండు: నేపాల్ అట్టుడుకుతోంది. జనరేషన్ జడ్ తిరుగుబాటుతో మంటల్లో తగలబడుతోంది. సోషల్ మీడియాపై నిషేధంతో రాజుకున్న నిరసనలు.. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చాయి. మంగళవారం (సెప్టెంబర్ 09) ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రులు, టాప్ పొలిటీషియన్ల ఇండ్లకు నిప్పుపెట్టేదాకా పరిస్థితులు వెళ్లాయి. ఆందోళనకారులు మాజీ ప్రధాని దేవ్ బాను, ఆయన భార్యను రక్తమోడేలా కొట్టారు.
మరో మాజీ ప్రధాని ఝలానాథ్ ఖనల్ ఇంటిని తగలబెట్టడంతో ఆయన భార్య కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దేశ ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ కొట్టిన దృశ్యాలు సైతం సంచలనం సృష్టించాయి. సోమవారం నాటి నిరసనల సందర్భంగా పోలీసు కాల్పుల్లో 19 మంది మృతి చెందడంపై జనరేషన్ జడర్స్ (1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) మంగళవారం మరింతగా రెచ్చిపోయారు.
ప్రధాని ఆఫీస్‌లోకి వందలాది మంది దూసుకెళ్లారు. ఓలీ గద్దె దిగిపోవాల్సిందేనని నినాదాలు చేశారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇండ్లతోపాటు పార్లమెంట్, సుప్రీంకోర్టు, మినిస్టర్స్ ఆఫీసుల భవనాలకు నిప్పుపెట్టారు. టాప్ పొలిటికల్ లీడర్ల ఇండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపైనా దాడులు చేసిన ఆందోళనకారులు.. రోడ్లపై వెహికల్స్‌కు నిప్పుపెట్టి, టైర్లు కాల్చేశారు. భారీగా బలగాలను మోహరించి, కర్ఫ్యూ విధించినా లెక్కచేయకుండా యువత రెండోరోజు కూడా వీధుల్లోకి వచ్చి భారీగా విధ్వంసానికి దిగారు.
కేపీ శర్మ ఓలీ ఇంటిని తగలబెట్టి ఆనందంతో డ్యాన్స్‌లు చేశారు. పార్లమెంట్‌కూ నిప్పు పెట్టడంతో ఆ భవనం అంతా నల్లని దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రులను భద్రతా బలగాలు ఆర్మీ హెలికాప్టర్లలో బ్యారక్లకు తరలించాయి.
ముగ్గురు పోలీసుల దారుణ హత్య
ఖాట్మండులోని కోటేశ్వర్ పోలీస్ డివిజన్ ఆఫీస్ పై మంగళవారం దాడి చేసిన నిరసనకారులు ముగ్గురు పోలీసులను దారుణంగా హత్య చేశారు. నిరసనకారులు దాడి చేయగానే, ఆ ముగ్గురు పోలీసులు లొంగిపోయినప్పటికీ తీవ్రంగా దాడి చేసి చంపేశారని ‘ఖబర్ హబ్’ న్యూస్ వెబ్ సైట్ వెల్లడించింది.
కాగా, ఖాట్మండులోని కాలంకిలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున టైర్లను కాల్చి, రోడ్లను బ్లాక్ చేశారు. అనేక చోట్ల రోడ్లపై వాహనాలను తగలబెట్టారు. నిరసనల నేపథ్యంలో ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేశారు. కాగా, నేపాల్ లోని రెండు జైళ్లపైనా నిరసనకారులు దాడులు చేశారు.
దీనిని అవకాశంగా మలచుకున్న దాదాపు 900 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరార్ అయ్యారు. ఖాట్మండులోని పోఖ్రా జైలు, నఖూ జైలుపై నిరసనకారులు దాడి చేయడంతో అక్కడి పోలీసులు పరార్ అయ్యారు. ఇదే అదనుగా నఖూ జైలులో ఖైదీగా ఉన్న మాజీ డిప్యూటీ పీఎం, మాజీ హోంమంత్రి రవి లమిచానే కూడా తన అనుచరుల సాయంతో ఇంటికి చేరుకున్నారు.
భారతీయులకు అడ్వైజరీ
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు మన ఫారిన్ మినిస్ట్రీ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లొద్దు. అక్కడ ఉంటున్న భారత పౌరులు వీధుల్లోకి రావొద్దు. అత్యవసర సాయం కోసం ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ ఆఫీసును సంప్రదించండి” అని సూచించింది.
ఫ్లైట్ సర్వీసులు రద్దు
నేపాల్‌లో హింసాత్మక ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ఖాట్మండు మధ్య నడిచే నాలుగు విమాన సర్వీసులను ఆ సంస్థ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇండిగో, నేపాల్ ఎయిర్ లైన్స్ కూడా ఢిల్లీ నుంచి ఖాట్మండుకు వెళ్లే ప్లైట్ సర్వీసులను మంగళవారం రద్దు చేశాయి. ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినా..
నేపాల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోలేదన్న కారణంతో ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా యాప్స్ పై కేపీ శర్మ ఓలీ సర్కారు గురువారం బ్యాన్ విధించింది. దీంతో సోమవారం జనరేషన్ జడ్ యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఓలీ సర్కారు రాత్రికల్లా దిగొచ్చింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అవినీతిలో కూరుకుపోయిన ఓలీ సర్కారు గద్దె దిగాల్సిందేనని, 19 మంది నిరసనకారుల కాల్చివేతకు బాధ్యత వహించాల్సిందేనంటూ యువత మంగళవారం ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.
జన్ జడ్ బ్యానర్ కింద రెండో రోజూ నిరసనలతో హోరెత్తించారు. ‘సోషల్ మీడియాను కాదు, అవినీతిని షట్ డౌన్ చేయాలి’, ‘జన్ జడ్ ఆధ్వర్యంలో నిరసనలు’ ‘కరప్షన్ కు వ్యతిరేకంగా యువత ఉద్యమం’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘కేపీ చోర్, దేశ్ ఛోడ్(కేపీ దొంగ, దేశాన్ని వదిలిపోవాలి)’, ‘అవితీని నేతలపై చర్యలు తీసుకోవాలి’, ‘స్టూడెంట్లను చంపొద్దు’ అని నినాదాలు చేశారు.
జెన్ జడ్ ఉద్యమం వెనుక సుదన్
ఖాట్మండు: నేపాల్ లో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఆ దేశ ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటి నుంచి యువతలో తిరుగుబాటు మొదలైంది. లక్షల మంది యువకులు రోడ్లమీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఉద్యమం తీవ్రమై హింసాత్మకంగా మారింది. పోలీసు కాల్పుల్లో 20 మంది చనిపోయారు.
యువత చేపట్టిన ఈ ఉద్యమం వెనక ‘హమీ నేపాలీ’ ఎన్జీఓ అధ్యక్షుడు సుదన్ గురుంగ్ ఉన్నారు. 2015 నాటి భూకంపంలో సుదన్ కొడుకు చనిపోయాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సుదన్.. సేవాకార్యక్రమాలు చేపట్టారు. హమీ నేపాలీ ఎన్జీవోను స్థాపించి పలు చారిటీ చేయడం ప్రారంభించాడు. క్రమంగా యువతలో అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
బీపీ కొయిరాలా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ లో పారదర్శకత కోసం ‘ఘోపా క్యాంప్’ నిరసనల్లోనూ పాల్గొన్నాడు. తాజాగా సోషల్ మీడియా యాప్ లు, ప్లాట్ ఫాంలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా ‘హమీ నేపాలీ’ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపాడు.
విధ్వంసానికి పాల్పడితే కఠినచర్యలు: ఆర్మీ
నిరసనకారులు విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ హెచ్చరించింది. దేశ ప్రజలు, పబ్లిక్ ప్రాపర్టీని కాపాడతామని, శాంతి భద్రతలను గాడిలో పెడతామని ప్రకటించింది. పాలనా పగ్గాలను చేపట్టేందుకు ఆర్మీ సిద్ధమైందని స్థానిక మీడియా వెల్లడించింది. నిరసనకారులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఈ మేరకు ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, ఇతర భద్రతా సంస్థల అధిపతులు నిరసనకారులకు మంగళవారం ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు.
రక్తమోడుతూ.. పొలంలో కూర్చున్న మాజీ పీఎం
ఖాట్మండులోని బుదనీల్ కాంత ఏరియాలో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ఇంటిపైనా ఆందోళనకారులు మంగళవారం దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ దాడిలో గాయపడిన దేవ్ బా ముఖం నుంచి రక్తమోడుతుండగా, ఇంటికి సమీపంలోని పొలంలో కూర్చున్న వీడియో వైరల్ అయింది. దేవ్ బాతోపాటు ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జూ రాణా దేవ్ బాపై కూడా నిరసనకారులు దాడి చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు వీరిని కాపాడి, అక్కడి నుంచి తరలించాయి.
ప్రధాని, ప్రెసిడెంట్, మంత్రుల రాజీనామా
నిరసనలు మంగళవారం మరింత చెలరేగడం తోపాటు ప్రధాని ఆఫీస్లోకీ దూసుకెళ్లారు. ఆ కొద్దిసేపటికే ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ‘‘దేశంలో నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితి నేపథ్యంలో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా, రాజకీయ పరిష్కారం సాధించేందుకు సహకరిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను” అని ఓలీ పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ కూడా ఆ వెంటనే తన పదవి నుంచి తప్పుకున్నారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. శాంతియుత పరిష్కారం సాధించేందుకు యువత సహకరించాలి. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. ఇప్పటికైనా ఆందోళనలు విరమించాలి” అని కోరారు. కాగా, ఓలీ కేబినెట్ లోని కొందరు మంత్రులు కూడా రాజీనామా చేశారు.
టాప్ లీడర్ల ఇండ్లపై దాడులు..
ఆందోళనకారులు ప్రధాని, మాజీ ప్రధానులు సహా టాప్ లీడర్ల ఇండ్లపై దాడులకు పాల్పడ్డారు. బాల్ కోట్ లోని కేపీ శర్మ ఓలీ ప్రైవేట్ హౌస్‌కు నిప్పుపెట్టి, ఆనందంతో డ్యాన్స్‌లు చేశారు. మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ), కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, రమేశ్ లేఖక్ ఇండ్లపైనా దాడులు చేసి, విధ్వంసం సృష్టించారు. ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ప్రైవేట్ రెసిడెన్స్ పైనా అటాక్ చేశారు. నేపాలీస్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసుతో పాటు ఇతర పార్టీల ఆఫీసులు, పలు పోలీస్ స్టేషన్లకూ నిప్పు పెట్టారు. సోషల్ మీడియాపై బ్యాన్‌కు ఆదేశాలు జారీచేసిన మంత్రి సుబ్బా గురుంగ్ ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ఇంటినీ ధ్వంసం చేశారు.