
- నేపాల్ అంతటా కర్ఫ్యూ
- దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించిన సైన్యం
- ఖాట్మండు సహా అన్ని సిటీల్లో బలగాల మోహరింపు
- నిర్మానుష్యంగా మారిన రాజధాని
- కొత్త ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీలా కర్కీకి ‘జన్ జడ్’ మద్దతు
- జనరేషన్ జడ్ ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ భేటీ
- నేపాల్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ఇండియన్లు
ఖాట్మండు: జనరేషన్ జడ్ యువత తిరుగుబాటుతో రెండ్రోజులపాటు అట్టుడికిన నేపాల్ ను ఆర్మీ తన కంట్రోల్ లోకి తీసుకుంది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను మంగళవారం (సెప్టెంబర్ 09) రాత్రి తన చేతిలోకి తీసుకున్న ఆర్మీ.. బుధవారం (సెప్టెంబర్ 10) దేశమంతటా ఆంక్షలు విధించడంతోపాటు నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. నిరసనల పేరుతో రోడ్ల మీదకు వచ్చినా, లూటీలు, హింసకు పాల్పడినా ఉపేక్షించబోమని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో సోమవారం ఖాట్మండు సహా అన్ని సిటీల్లో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పోలీసు కాల్పుల్లో 19 మంది మృతిచెందడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. దీంతో రాత్రికల్లా దిగొచ్చిన సర్కారు సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినా.. ఆందోళనకారులు అవినీతి వ్యతిరేక ఉద్యమం, నెపో కిడ్స్ మూమెంట్ కొనసాగించారు. మంగళవారం ఏకంగా దేశ ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇండ్లతోపాటు పార్లమెంట్, సుప్రీంకోర్టు, పార్టీ ఆఫీసుల భవనాలనూ తగలబెట్టారు.
దీంతో దేశ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ, అధ్యక్ష పదవికి రామచంద్ర పౌడేల్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. దేశంలో ఆంక్షలు, కర్ఫ్యూ విధించింది. బుధవారం సాయంత్రం 5 వరకూ ఆంక్షలు, ఆ తర్వాత గురువారం ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతుందని ప్రకటించింది.
27 మంది అరెస్ట్.. 31 వెపన్స్ స్వాధీనం
ఖాట్మండులోని ఛాబహిల్, బౌద్ధ, గావ్ శాల ఏరియాల్లో నిరసనల సందర్భంగా లూటీలు చేయడం, ఇండ్లకు నిప్పు పెట్టడం, విధ్వంసానికి పాల్పడటం వంటి చర్యల్లో పాల్గొన్న 27 మందిని భద్రతా బలగాలు బుధవారం అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి లూటీ చేసిన రూ. 3.37 లక్షల క్యాష్, 31 వెపన్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, జన్ జడ్ ప్రతినిధులు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ చర్చలు జరిపారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
టూరిస్టులపైనా దాడులు..
నేపాలలో ఎటు చూసినా అరాచకత్వం రాజ్యమేలుతోందని, టూరిస్టులపైనా దాడులు జరుగుతున్నాయని ఇండియన్ టూరిస్టులు సోషల్ మీడియా వేదికగా గోడు వెళ్లబోసుకున్నారు. అల్లర్ల నేపథ్యంలో తాము చిక్కుకుపోయామని, కాపాడాలని ఇండియన్ ఎంబసీకి విజ్ఞప్తులు చేశారు. మానస సరోవర యాత్ర కోసం వెళ్లిన తాము ఖాట్మండులోని ఓ హోటల్లో ఉండగా ఆందోళనకారులు దాడిచేశారని బెంగళూరుకు చెందిన గౌరి అనే టూరిస్ట్ వెల్లడించారు.
హోటల్లో 150 మంది ఇండియన్లు ఉన్నట్టు తెలిపారు హోటల్‌ను తగలబెట్టడంతో అతికష్టం మీద తప్పించుకుని బయటపడ్డానని ఉపాసనా గిల్ అనే ఇండియన్ వాలీబాల్ ప్లేయర్ వెల్లడించారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన 200 మంది తెలుగువాళ్లను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా, నేపాల్‌లో ఆందోళనలు, హింస నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ జైళ్ల నుంచి దాదాపు 7 వేల మంది ఖైదీలు పరారయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ బార్డర్లో ఇండియా అలర్ట్ అయింది. బార్డర్ వెంబడి
సశస్త్ర సీమా బల్ బలగాలను మోహరించింది.
ఖాట్మండు నిర్మానుష్యం
ఆర్మీ రంగంలోకి దిగడం, ఆంక్షలు, కర్ఫ్యూ విధించడంతో రెండ్రోజులుగా ఖాట్మండు వీధుల్లో విధ్వంసం సృష్టించిన వేలాది మంది ఆందోళనకారులు బుధవారం ఇండ్లకే పరిమితమయ్యారు. నగరం దాదాపు నిర్మానుష్యంగా మారిపోయింది. ఖాట్మండుతోసహా అన్ని ప్రధాన నగరాలు, ప్రభుత్వ ఆఫీసులు, భవనాల వద్ద ఆర్మీ బలగాలను మోహరించింది. వీధుల్లో ఆర్మీ జవాన్లు గస్తీ నిర్వహించారు. ఆందోళనల సమయంలో పోలీసుల నుంచి లూటీ చేసిన గన్స్, బుల్లెట్స్ ను తిరిగి ఇచ్చేయాలని, ఎవరైనా వాటిని తమ వద్దే ఉంచుకుని పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆర్మీ హెచ్చరించింది.