ఆన్‌‌లైన్‌‌ మోసాల్లో ఢిల్లీ టాప్

ఆన్‌‌లైన్‌‌ మోసాల్లో ఢిల్లీ టాప్

దేశంలో ఆన్‌‌లైన్‌‌ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్‌‌ బ్యాంకింగ్‌‌, ఏటీఎం, డెబిట్‌‌, క్రెడిట్‌‌ కార్డులకు సంబంధించిన నేరాలు ఎక్కువవుతున్నాయి. 2018–19 ఏడాదిలో ఇలాంటి మోసాలు 52 వేల మార్కును దాటాయి. ఆన్‌‌లైన్‌‌ నేరాలకు దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా మారిపోయింది. ఫ్రాడ్‌‌ క్యాపిటల్‌‌ ఆఫ్‌‌ ఇండియాగా అపఖ్యాతి మూటగట్టుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల్లో 27 శాతం ఇక్కడే జరిగాయి. బుధవారం పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ఇంటర్నెట్‌‌, ఏటీఎం కార్డు మోసాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగాయని, 2017–18లో 34,791 జరిగితే 2018–19లో 52,304 నమోదయ్యాయని పేర్కొంది. ఇలాంటి నేరాల వల్ల అంతకుముందు ఏడాది రూ.169 కోట్లు జనం కోల్పోతే.. ఈసారి అది రూ.149 కోట్లకు తగ్గిందని వివరించింది.

నంబర్‌‌లో ఎస్బీఐ, షేర్‌‌లో ఐడీబీఐ

ఆన్‌‌లైన్‌‌ నేరాల్లో ఢిల్లీ ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో ఉందని, ఇక్కడ 3,164 మంది ఏటీఎం నేరాలపై ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెప్పింది. తర్వాత మహారాష్ట్రలో 2,770, యూపీలో 1,446, పంజాబ్‌‌లో 390, గుజరాత్‌‌లో 385 కేసులు నమోదయ్యాయంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 11,816 కేసులు పెట్టారని చెప్పింది. బ్యాంకుల లెక్కన చూస్కుంటే ఎక్కువ మోసాలు ఎస్బీఐ ఏటీఎంలలో జరిగాయని, కానీ షేర్‌‌ లెక్కన చూస్తే ఐడీబీఐ వాటా ఎక్కువుందని వివరించింది. ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 58 వేల ఏటీఎంలు ఉన్నాయని, గత రెండేళ్లలో 2,468 మోసాలు జరిగాయని చెప్పింది. అదే ఐడీబీఐ ఏటీఎంలు 3,700 ఉంటే మోసాలు 1,800 జరిగాయని పేర్కొంది.  అంటే ఏటీఎంల సంఖ్యతో మోసాలను పోల్చి చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ఐడీబీఐవి 1.8 శాతమని, నేరాలు మాత్రం 15 శాతమని చెప్పింది. ఏటీఏం మోసాలకు సంబంధించి ప్రైవేట్‌‌ బ్యాంకుల లెక్కలు అందుబాటులో లేవని వెల్లడించింది. ఆన్‌‌లైన్‌‌ నేరాలు ఎందుకు ఎక్కువవుతున్నాయో  మాత్రం ప్రభుత్వం చెప్పలేదు.

యూరప్‌‌ దేశాల్లో అంతా అప్‌‌డేట్‌‌

విదేశీయులు ఎక్కువగా దేశంలో ఆన్‌‌లైన్‌‌ మోసాలు చేస్తున్నారని బ్యాంకులు చెబుతున్నాయి. ‘యూరప్‌‌ దేశాల్లో ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ అప్‌‌డేట్‌‌ చేశారు. దీంతో నేరాలు చేయడం అక్కడి వాళ్లకు కష్టమైంది’ అని పేర్కొన్నాయి. ఏటీఎంల కీ ప్యాడ్‌‌లపై కెమెరాలు పెట్టి, మాల్‌‌వేర్‌‌ వాడి మోసాలు చేస్తున్నారని చెప్పాయి. నేరాలను కట్టడి చేయడానికి ఆర్బీఐ ఇప్పటికే చర్యలు చేపట్టింది. చిప్‌‌, పిన్‌‌ ఉన్న కార్డులనే వాడాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ బ్యాంకులు మాత్రం చాలా మెల్లిగా చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.