సిరిసిల్ల టౌన్, వెలుగు : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్థానిక కాలేజీ గ్రౌండ్‌లో ‘నేతన్న గర్జన మహాసభ’ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య మాట్లాడారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు సిరిసిల్ల నేత కార్మికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధివిధానాలే కారణమన్నారు. కార్మికుల సమస్యలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏనాడూ పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే గ్రామాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. నేతన్నలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కరెంట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారానికి సిరిసిల్ల జేఏసీ అండగా ఉంటుందన్నారు.