బజ్‌బాల్ క్రికెట్ vs బోరింగ్ క్రికెట్: విసుగు పుట్టిస్తున్న భారత బ్యాటర్లు

బజ్‌బాల్ క్రికెట్ vs బోరింగ్ క్రికెట్: విసుగు పుట్టిస్తున్న భారత బ్యాటర్లు

'టెస్ట్ మ్యాచులకు ఆదరణ తగ్గుతోంది..', 'టెస్ట్ ఫార్మాట్ కనుమరుగువుతోంది..' ఏడాది క్రితం వరకూ ఎటు చూసినా ఈ వార్తలే.. ఏ క్రికెట్ విశ్లేషకుడిని పలకరించినా ఈ వ్యాఖ్యలే. కానీ ఇంగ్లండ్ జట్టు ఆచరించిన 'బజ్‌బాల్' శైలి ఆ మాటలను వట్టి మాటలే అని నిరూపించింది. 

కెప్టెన్‌గా బెన్ స్టోక్స్.. కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్ బాధ్యతలు చేపట్టాక ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవాలి. ప్రత్యర్థి ఎవరైనా.. ఫార్మాట్ ఏదైనా.. వీరి ఆటలో మాత్రం బెణుకు ఉండదు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగటం వీరి బజ్‌బాల్ క్రికెట్ ప్రత్యేకత. ఓటములు ఎదురైనా వెనక్కు తగ్గరు. ఆ శైలే.. టెస్ట్ క్రికెట్‌కు తిరిగి ప్రాణం పోసింది. 

కానీ వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తుంటే మరోసారి పాత రోజులు గుర్తొస్తున్నాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పసికూన జట్లపై ఓడిన వెస్టిండీస్‌తో సిరీస్ అంటేనే ఆసక్తి లేదంటే.. భారత బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్ చేస్తూ మరింత విసుగు పుట్టిస్తున్నారని వారు కామెంట్లు చేస్తున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌కు పోటీగా భారత క్రికెటర్లు.. 'బోరింగ్ క్రికెట్'కు కనిపెట్టారని ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

కాగా, హిట్ మ్యాన్ పేరొందిన రోహిత్ శర్మ(103) సెంచరీ చేయడానికి 221 బంతులు తీసుకుంటే, రన్ మెషిన్‌గా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న విరాట్ కోహ్లీ తొలి ఫోర్ సాధించడానికి ఏకంగా 81 బంతులు తీసుకోవటం గమనార్హం. ఈ గణాంకాలు ప్రస్తావిస్తూ నెటిజెన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.