
బీజింగ్: భారత్ దగ్గర అణు బాంబులు లేవు.. అంతే కాదు, అమెకారి వంటి అగ్రదేశాలను సైతం భయపెట్టిన ఉత్తరకొరియా కూడా అణు శక్తి దేశం కాదు.. ఏమిటీ అర్థం లేని స్టేట్మెంట్లు అనుకుంటున్నారా? ఈ వ్యాఖ్యలు చేసింది మన పొరుగునే ఉన్న చైనా.
భారత్, పాకిస్థాన్ లను తాము ఎప్పడూ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించలేదని చైనా తెలిపింది. ఈ విషయంలో ఇప్పటికీ తమ అభిప్రాయం అదేనని చెప్పింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ మాట అన్నారు. అలాగే వరుస అణ్వస్త్ర ప్రయోగాలతో ప్రపంచాన్నివణికించిన ఉత్తర కొరియాకు కూడా అణు శక్తి దేశమనే హోదా తాము ఇవ్వలేదని చెప్పారు.
వియత్నాంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్న మధ్య భేటీలో ఎటువంటి ఒప్పందం జరగకపోవడంపై మీడియా కాంగ్ ను ప్రశ్నించింది. ఉత్తర కొరియాలోని రెండు న్యూక్లియర్ ప్రాసెసింగ్ యూనిట్లను మూసివేయాలన్న అమెరికా డిమాండ్ పై బుధ, గురువారం జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాకుండానే ముగిశాయి.
దీన్ని ప్రస్తావిస్తూ భారత్, పాక్ లాగే ఉత్తర కొరియాను కూడా అణ్వస్త్ర దేశంగా చూస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా చైనా ప్రతినిధి కాంగ్ పై విధంగా స్పందించారు.