
ముంబై: ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు నేటి నుంచి పెరుగుతున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలని జూన్ 2021లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు రూ. 20 గా ఉన్నాయి. ప్రతీ కస్టమర్‌కు తన సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు యథాప్రకారం కొనసాగుతాయి. ఇంటర్ ఛేంజ్ ఫీను రూ. 15 నుంచి రూ. 17 కి పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఈ ఇంటర్ ఛేంజ్ ఫీని రూ. 6 కి పెంచింది. ఈ మార్పు గత ఏడాది ఆగస్టు 1 నుంచే అమలులోకి వచ్చింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఛార్జీలను పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఏటీఎం ఛార్జీల రివ్యూ కోసం జూన్ 2019లో ఒక కమిటీని ఆర్బీఐ నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా ఐబీఏ సీఈఓ వ్యవహరించారు. దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులన్నీ కలిపి మార్చి 2021 చివరి నాటికి జారీ చేసిన డెబిట్ కార్డుల సంఖ్య 90 కోట్లు. మన దేశంలోని మొదటి ఏటీఎంను హెచ్ఎస్బీసీ బ్యాంకు 1987లో ముంబైలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 12 ఏళ్లలో 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఇంటరాపరబుల్ ట్రాన్సాక్షన్ల కోసం స్వధన్ నెట్‌వర్క్‌ను 1997 లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మొదలు పెట్టింది.